Rachamallu Sivaprasad Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పనిచేస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిలువునా వంచిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. నారా లోకేశ్ కడప జిల్లా పర్యటన వల్ల స్థానికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, కేవలం వైఎస్ జగన్‌పై బురద చల్లడానికే ఆయన ఇక్కడికి వచ్చారని విమర్శించారు.

వివేకా కేసుపై కోర్టులు తేల్చినా అబద్ధపు ప్రచారాలు:
దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని సీబీఐతో పాటు సుప్రీం కోర్టు సైతం స్పష్టం చేసిన విషయాన్ని రాచమల్లు గుర్తుచేశారు. అయినప్పటికీ కూటమి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ లాంటివారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. వైఎస్ జగన్ రాయలసీమ రత్నమని కొనియాడారు.
Rachamallu Sivaprasad Reddy: రైతులకు జగన్ అండ.. చంద్రబాబు రైతు ద్రోహి:
గతంలో ‘వ్యవసాయం దండగ’ అన్న చంద్రబాబు పక్కా రైతు ద్రోహి అని రాచమల్లు విమర్శించారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేలు (RBKs), ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ వంటి విప్లవాత్మక పథకాలతో వైఎస్ జగన్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని ప్రశంసించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు.
జగన్ కట్టిన స్కూళ్లతో లోకేశ్ షోకులు:
వైఎస్ జగన్ హయాంలో నాడు-నేడు కింద ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలలను చూపిస్తూ నారా లోకేశ్ షోకులు పడుతున్నారని రాచమల్లు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 18 ప్రభుత్వ వైద్య కళాశాలల (Medical Colleges) నిర్మాణాన్ని పూర్తి చేయలేక ఈ కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

