Delhi Crime: దేశ రాజధాని ఢిల్లీలో ప్రేమ వివాహం చేసుకున్న రెండు నెలలకే ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లోధి కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆకృతి సుతార్ (28) అనే యువతి మృతి చెందిన కేసులో పోలీసులు జరిపిన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆమె చనిపోవడానికి ముందు తన మొబైల్ ఫోన్‌లో “ఆత్మహత్య ఎలా చేసుకోవాలి?” (How to commit suicide) అనే అంశంపై గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కట్నం వేధింపులే కారణం – భర్త అరెస్ట్
ఈ ఘోర ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి భర్త అరస్తు సిక్కాను అధికారికంగా అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. అదనపు కట్నం తీసుకురాలేదనే నెపంతో భర్త అరస్తు సిక్కా తన కూతురిని పెళ్లయిన నాటి నుంచి నిత్యం మానసికంగా, శారీరకంగా వేధించేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి తర్వాత ఆమెపై ఒత్తిడి తెస్తూ రూ.10 లక్షల నగదుతో పాటు ఒక కొత్త కారును కట్నంగా డిమాండ్ చేసినట్లు వారు తమ ఫిర్యాదులో ఆరోపించారు.
Delhi Crime: అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు

భర్త వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆకృతి సుతార్.. చివరికి ఆత్మహత్యే శరణ్యమని భావించి అపార్ట్‌మెంట్ పైనుంచి దూకినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమవుతోంది. చనిపోయే ముందు ఆమె మానసిక స్థితి ఎలా ఉందనే కోణంలో ఆమె మొబైల్ హిస్టరీని విశ్లేషిస్తున్నారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు.. వరకట్న వేధింపుల చట్టం కింద కేసును నమోదు చేసి, ఘటనకు సంబంధించి మిగిలిన అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

