Chevireddy Bhaskar Reddy: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది.
అనారోగ్య సమస్యల నిమిత్తం వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు కోర్టు ఆయనకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఆయన అమెరికాలో పర్యటించుకోవచ్చని న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వైద్యం కోసం మరోసారి అమెరికా పర్యటన: కోర్టులో పిటిషన్ దాఖలు
గతంలో కూడా వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లోచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాజాగా మరోసారి అదే కారణంతో విదేశీ ప్రయాణానికి అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువైపుల వాదనలను పరిశీలించి, ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటూ పర్యటనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Chevireddy Bhaskar Reddy: కఠిన నిబంధనలు విధించిన న్యాయస్థానం: పాస్‌పోర్టు సరెండర్ చేయాలని ఆదేశం
అమెరికా పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, కొన్ని కఠినమైన షరతులను చెవిరెడ్డికి విధించింది. విదేశాల్లో బస చేసే సమయంలో అక్కడి పూర్తి చిరునామా, ఫోన్ నంబరు మరియు ఈ-మెయిల్ వివరాలను ముందస్తుగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అలాగే, ప్రయాణానికి ముందే తగిన సెక్యూరిటీ బాండ్లు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు కోర్టులో జమ చేయాలని స్పష్టం చేసింది. పర్యటన ముగిసిన వెంటనే తిరిగి వచ్చి తన పాస్‌పోర్టును యథావిధిగా న్యాయస్థానానికి అప్పగించాలని నిబంధన విధించింది.

