Chicken Price: రాష్ట్రంలో చికెన్ ప్రియులకు త్వరలోనే పెను భారం పడనుంది. కోళ్ల పెంపకానికి అత్యంత కీలకమైన దాణా (Poultry Feed) ముడిసరుకుల ధరలు మార్కెట్‌లో ఆకాశాన్ని తాకడమే దీనికి ప్రధాన కారణం.
కొన్ని నెలల క్రితం వరకు టన్ను సోయాబీన్ ధర రూ. 30,000 నుండి 35,000 వరకు ఉండగా, ప్రస్తుతం అది రెట్టింపు స్థాయికి చేరింది. అలాగే క్వింటాల్ మొక్కజొన్న రూ. 1,700 నుండి 1,800, వేరుశనగ పిండి (చక్క) రూ. 1,200, నూకల ధరలు రూ. 1,700 వరకు ఉండగా.. ప్రస్తుతం వీటి ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. పంట దిగుబడి తగ్గడం వల్ల సోయాబీన్ కొరత ఏర్పడగా, మరోవైపు మొక్కజొన్నను ఇథనాల్ తయారీకి విస్తృతంగా వినియోగిస్తుండటంతో దాణా తయారీకి తీవ్ర లభ్యత సమస్య వచ్చిపడింది. ఫలితంగా కోళ్ల పెంపకం వ్యయం భారీగా పెరిగి పొల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.

వినియోగదారులపై ప్రభావం – కేజీ చికెన్ రూ.300కి చేరువలో!
దాణా వ్యయం పెరగడంతో ఆ భారం అంతా చివరికి వినియోగదారులపై పడనుంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో వ్యాపారులు చికెన్ విక్రయ ధరలను పెంచడం అనివార్యంగా మారింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చికెన్ రీటైల్ ధరలు క్రమంగా పెరుగుతుండగా, రాబోయే రోజుల్లో కిలో చికెన్ ధర రూ. 300 మార్కును దాటే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారంలో కనీసం ఒకరోజైనా చికెన్ ఉండాల్సిందే అనుకునే సగటు మధ్యతరగతి కుటుంబాలకు ఈ ధరల పెంపు పెద్ద షాక్‌గా మారింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని దాణా లభ్యతను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఇటు పొల్ట్రీ పరిశ్రమ, అటు సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

