Punjab CM : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సతీమణి డాక్టర్ గురైత్ (గుర్‌ప్రీత్) కౌర్ తీవ్ర స్థాయి వివాదంలో చిక్కుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఒక అత్యాచారం కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడానికి మరియు నిందితుడిని కాపాడేందుకు సీఎం భార్య రూ. 5 కోట్ల లంచం డిమాండ్ చేశారంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఈ విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా పరిగణించి, పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)లకు సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. బాధితురాలికి న్యాయం జరగాలంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (SAD) నేతలు పట్టుబడుతూ, సీఎం భగవంత్ మాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
CM Bhagwant Singhఆరోపణలను ఖండించిన ఆప్: రిటైర్డ్ జడ్జికి లీగల్ నోటీసులు
ఈ పరిణామంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు తీవ్రంగా స్పందిస్తూ, ఈ ఆరోపణలను పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవి మరియు భ్రమజనితమైనవిగా కొట్టిపారేశారు. తనపై అసత్య ప్రచారాలు చేసి ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ గురైత్ కౌర్ ఇప్పటికే మాజీ జడ్జి జస్టిస్ రంజిత్ సింగ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. నిర్ణీత సమయంలోగా ఆయన స్పందించకుంటే చట్టపరమైన క్రిమినల్, సివిల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసులో హెచ్చరించారు. అయితే, అధికార దుర్వినియోగం, రాజకీయ ఒత్తిళ్ల ఆరోపణలపై పారదర్శకమైన విచారణ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో ఈ అంశం పంజాబ్ రాజకీయంలో మరింత ఉత్కంఠను రేపుతోంది.

