Tollywood : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకురావాలంటూ ప్రముఖ నటుడు శివాజీ చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సానుకూలంగా స్పందించారు.
‘లెనిన్’ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన, చిత్రసీమ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున భారీ రాయితీలు కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో స్టూడియాలు, డబ్బింగ్ యూనిట్లు, రీ-రికార్డింగ్ థియేటర్ల నిర్మాణానికి పరిశ్రమ వర్గాలు ముందుకు వస్తే ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సినీ రంగ ప్రముఖులు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైతే, వారికి అవసరమైన భూములను కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

సింగిల్ విండో అనుమతులు, ఫ్లెక్సిబుల్ టికెట్ రేట్లు
సినిమా షూటింగులు, ఇతర నిర్మాణ పనుల కోసం నిర్మాతలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ‘సింగిల్ విండో’ విధానం ద్వారా అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి దుర్గేశ్ వెల్లడించారు. అంతేకాకుండా, టాలీవుడ్‌ను ఆర్థికంగా నిలబెట్టేందుకు వీలుగా సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఒక అనుకూలమైన, సరళమైన (ఫ్లెక్సిబుల్) జీవోను తీసుకురావడానికి ప్రభుత్వం చురుగ్గా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్ని ప్రాంతాల్లోనూ బలంగా విస్తరించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఇందుకోసం సినీ పెద్దలు, పెట్టుబడిదారులు ఏపీకి తరలివచ్చి ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

