Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దసరా వేళ 4 పాలపిట్టలకు విముక్తి.. సీపీ సజ్జనార్‌ కీలక చర్య

దసరా వేళ 4 పాలపిట్టలకు విముక్తి.. సీపీ సజ్జనార్‌ కీలక చర్య

వార్త 3 days ago

Palapitta Rescue: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కొందరు స్వార్థపరులు పాల్పడిన అమానుష చర్యను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన 'పాలపిట్ట'ను పండుగ పేరుతో బోనుల్లో బంధించి వ్యాపారం చేయాలని చూసిన వ్యక్తుల చెర నుంచి వాటికి విముక్తి కల్పించారు.

ప్రజల నుంచి అందిన పక్కా సమాచారంతో నగరంలోని మూడు వేర్వేరు ప్రాంతాలలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి, మొత్తం నాలుగు మూగజీవాలను సురక్షితంగా రక్షించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.

మూడు ప్రాంతాల్లో దాడులు – నాలుగు పాలపిట్టల రెస్క్యూ

దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవడం శుభప్రదమనే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు మూగజీవాలను హింసిస్తూ సొమ్ము చేసుకునేందుకు యత్నించారు. ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొందరు వాటిని పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో లంగర్‌హౌస్ బాపూఘాట్ సమీపంలోని ఓ ఆలయం వద్ద రెండు, ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం దగ్గర ఒకటి, అలాగే మంగళ్‌హాట్ బాలాజీనగర్ ఆలయ ప్రాంతంలో మరో పాలపిట్టను బోనుల్లో బంధించి ఉంచారు. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆ నాలుగు పక్షులను కాపాడారు.

Palapitta Rescue: అటవీ శాఖ అధికారులకు అప్పగింత – సీపీ సజ్జనార్ హెచ్చరిక

పోలీసులు రక్షించిన నాలుగు పాలపిట్టలను వెంటనే కేబీఆర్ పార్క్ అటవీ శాఖ అధికారులకు సురక్షితంగా అప్పగించారు. వన్యప్రాణులను, మూగజీవాలను హింసిస్తే ఉపేక్షించేది లేదని, నిందితులపై అటవీ శాఖ నిబంధనల ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పండుగ ఆనందం పేరుతో స్వేచ్ఛగా ఎగరాల్సిన పక్షులను బంధించి నీరు, ఆహారం లేకుండా చిత్రహింసలకు గురిచేయడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.

నిజమైన భక్తి జీవుల పట్ల కరుణ చూపడమే: ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

“బోనులోని పక్షి ఆర్తనాదాలతో ఎవరికైనా శుభం ఎలా కలుగుతుంది? జీవుల పట్ల దయ చూపడమే అసలైన భక్తి కానీ, ప్రకృతిని బంధించడం కాదు” అని సీపీ సజ్జనార్ తన సోషల్ మీడియా వేదికగా హితవు పలికారు. ఇలాంటి అమానవీయ ఘటనలను ఎవరూ ప్రోత్సహించవద్దని సూచించారు. వన్యప్రాణులకు ఎక్కడైనా హాని తలపెట్టే ఘటనలు జరిగితే వెంటనే స్పందించి సమాచారం అందించాలని కోరారు. ప్రజలు ఏవైనా ఫిర్యాదుల కోసం 18004255364, 9803338666 నంబర్లకు లేదా డయల్ 112కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Epaper: epaper.vaartha.com

యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha