Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దయ్యాలు వేదాలు పలికినట్లుంది!

దయ్యాలు వేదాలు పలికినట్లుంది!

వార్త 1 week ago

Yennam Srinivas Reddy: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (CLP) కార్యాలయంలో శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLI) పై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నాయకుల తీరు “దయ్యాలు వేదాలు పలికినట్టు” ఉందని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్ సిఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును రాజకీయ అవసరాలకు వాడుకుందే తప్ప జిల్లాను సస్యశ్యామలం చేయాలనే చిత్తశుద్ధి వారికి లేదని మండిపడ్డారు.

7 ఏళ్లు ఏం చేశారు?

“2015లోనే పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన జీవో ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. దానికి సంబంధించిన డీపీఆర్ (DPR) ను కేంద్ర జల సంఘానికి (CWC) ఇవ్వడానికి ఏకంగా ఏడేళ్ల సమయం తీసుకుంది. 2022లో అరకొర సమాచారంతో సమర్పించింది” అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం రూ. 27,000 కోట్లు ఖర్చు చేసి, కేవలం ఒకే ఒక్క పంప్ హౌస్ ఆన్ చేసి చేతులు దులుపుకుందని, కానీ ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేకపోయిందని తీవ్రంగా విమర్శించారు.

చిక్కుముడులు విప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పర్యావరణ, సాంకేతిక అనుమతులను సాధించిందని యెన్నం వివరించారు. ప్రస్తుతం రూ. 7,000 కోట్లతో భూసేకరణ (Land Acquisition) లో ఉన్న చిక్కుముడులన్నింటినీ విప్పుతూ పనులను వేగవంతం చేశామన్నారు. కేవలం భూసేకరణ కోసమే తమ ప్రభుత్వం రూ. 6,000 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. డిసెంబర్ 2027 లక్ష్యంగా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి నిరంతరం రివ్యూ మీటింగ్లు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

Yennam Srinivas Reddy: బీఆర్ఎస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెబుతారు!

రాజకీయ ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు పాదయాత్రలు చేస్తూ ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని, వారి కల్లబొల్లి మాటలను పాలమూరు ప్రజలు ఎన్నటికీ నమ్మరని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే మూడు పునాదులపై తెలంగాణను అభివృద్ధి చేయడమే సీఎం రేవంత్ రెడ్డి కంకణం అని పేర్కొన్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పిన ప్రజలు.. రాబోయే మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అదే తీర్పుతో తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha