Modi : 1947 ఆగస్టు 14న జరిగిన దేశ విభజన నాటి దారుణాల్ని, ఆ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన మరియు నిరాశ్రయులైన లక్షలాది మంది బాధితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా స్మరించుకున్నారు.
‘విభజన భీభత్స స్మృతి దినోత్సవం’ (Partition Horrors Remembrance Day) సందర్భంగా ఆయన బాధితుల ధైర్యసాహసాలు, అమూల్యమైన త్యాగాలకు నివాళులర్పించారు. ఆనాటి రక్తపాతం, హింస మరియు ఆస్తిపాస్తుల నష్టం మిగిల్చిన ఆరని గాయాలను గుర్తుచేసుకుంటూ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆనాటి పీడకలలను స్మరించుకోవడం అంటే కేవలం గతాన్ని తవ్వడం కాదని, ఆనాటి బాధితుల వేదనకు గౌరవమిస్తూ దేశంలో శాంతిభద్రతలను కాపాడుకోవడమేనని స్పష్టం చేశారు.
PM Modi సమైక్య భారత్ నిర్మాణం: మానవీయ విలువలు, సమాజ సామరస్యానికి పిలుపు
దేశ విభజన నాటి విషాదకర పాఠాల నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. సామాజిక సామరస్యం, మానవత్వం మరియు ఐక్యతలే ఒక దేశానికి అసలైన బలమని ఆయన పేర్కొన్నారు. దేనివల్ల అయితే మన మధ్య విద్వేషాలు రగులుకుంటాయో వాటికి దూరంగా ఉంటూ, ‘బలమైన సమైక్య భారత్’ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. విభజన సమయంలో ప్రజలు అనుభవించిన నరకయాతనను విస్మరించకుండా, భవిష్యత్ తరాలకు ఐక్యతా సందేశాన్ని అందిస్తూ ముందుకు సాగడమే ఆనాటి బాధితులకు ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధాని ఉద్ఘాటించారు.

