దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం వెలువడనున్న ఈ తీర్పు ఐదు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (మే 4, 2026) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజుల పాటు సాగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ తర్వాత, ప్రజల తీర్పు ఈవీఎంల నుంచి బయటకు రానుంది. ఈ ఫలితాలు కేవలం ఆయా రాష్ట్రాలకే పరిమితం కాకుండా, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
Read Also : ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్: ఈసీ నిర్ణయంపై టీఎంసీ ఆగ్రహం

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు: తమిళనాడులో ‘విజయ్’ మాయ?
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈసారి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) సంచలనం సృష్టించవచ్చని కొన్ని సర్వేలు పేర్కొంటున్నాయి. డీఎంకే-ఏఐఏడీఎంకేల మధ్య సాగే ద్రవిడ పోరులోకి విజయ్ ఎంట్రీ ఇవ్వడం, యువత మద్దతు ఎక్కువగా ఉండటంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మరియు బీజేపీ మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. బెంగాల్ ఓటర్లు మళ్లీ ‘దీదీ’కే పట్టం కడతారా లేక కమలం వికసిస్తుందా అనేది రేపు తేలనుంది.
కేరళలో మార్పు.. అస్సాం, పుదుచ్చేరిలో పట్టు
కేరళలో ఈసారి అధికార మార్పిడి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. సాధారణంగా అక్కడ ఐదేళ్లకోసారి అధికారం మారే సంప్రదాయం (LDF vs UDF) ఉండటంతో, యూడీఎఫ్ కూటమి ఆశలు పెట్టుకుంది. అయితే పినరయి విజయన్ వరుసగా మూడోసారి విజయం సాధించి రికార్డు సృష్టిస్తారా అన్నది చూడాలి. ఇక అస్సాం మరియు పుదుచ్చేరిలో బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంటుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. అస్సాంలో హేమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం దిశగా అడుగులు వేస్తోందని అంచనా. ఈ అంచనాలు నిజమవుతాయా లేక ఫలితాలు తారుమారవుతాయా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

