Prices Hike: సాధారణ ప్రజలపై ఇంధన ధరల భారం ఒక్కసారిగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు భారీగా పెరగడంతో, దేశీయంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను సుమారు 3 రూపాయల వరకు పెంచేసాయి.
ఈ ఆకస్మిక పెంపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోజంతా రోడ్లపైనే ఉంటూ జీవనం సాగించే గిగ్ వర్కర్లు (క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు) ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేడు 5 గంటల పాటు నిలిచిపోనున్న యాప్ ఆధారిత సేవలు
పెరిగిన ఇంధన ధరలకు తోడు యాప్ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్లను పెంచకపోవడానికి నిరసనగా శనివారం (నేడు) దేశవ్యాప్త తాత్కాలిక సమ్మెకు పిలుపునిచ్చారు. ‘గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్’ (GIPSWU) ఆధ్వర్యంలో ఈ నిరసన జరగనుంది. నేడు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యాప్ ఆధారిత క్యాబ్‌లు, బైక్ టాక్సీలు, ఫుడ్ మరియు గ్రాసరీ డెలివరీ సర్వీసులన్నింటినీ తాత్కాలికంగా బంద్ చేయాలని యూనియన్ కార్మికులను కోరింది. ఎంత కష్టపడినా పెరుగుతున్న ఇంధన ధరల వల్ల రోజువారీ ఖర్చులు కూడా రావడం లేదని సోషల్ మీడియా వేదికగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో రూ. 110 దాటిన పెట్రోల్.. ధరల పెంపునకు గల కారణాలు

తాజా ధరల సవరణ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.77 కి, డీజిల్ రూ. 90.67 కి చేరింది. ఇక భాగ్యనగరం హైదరాబాద్‌లో ఈ వాత మరింత గట్టిగా తగిలింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 3.3 పెరిగి రూ. 110.8 కి (గతంలో రూ. 107.5 పరిధిలో ఉండేది) చేరింది. అలాగే డీజిల్ ధర కూడా లీటరుకు రూ. 3.2 పెరిగి రూ. 98.9 కి చేరుకుంది. అంతర్జాతీయంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడమే ఈ రేట్ల పెంపునకు ప్రధాన కారణం. గతంలో బ్యారెల్ ముడిచమురు ధర 70 డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా 105 డాలర్లకు పైగా చేరింది.
Prices Hike: సంపాదన అంతా పెట్రోల్‌కే.. క్యాబ్ డ్రైవర్ల ఆవేదన
ఈ ధరల పెంపుతో క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. “పెట్రోల్ రేట్లు పెరిగిన ప్రతిసారీ మా జేబుల నుంచి పెట్టే పెట్టుబడి పెరుగుతోంది, కానీ యాప్ కంపెనీలు మాత్రం కస్టమర్ల నుంచి వసూలు చేసే ఛార్జీలను (Fares) పెంచడం లేదు. రోజు ముగిసేసరికి కమీషన్లు, ఇంధన ఖర్చులు పోను ఇల్లు గడవడమే కష్టంగా మారుతోంది” అని హైదరాబాద్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ మహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. క్రిసిల్ (Crisil) అంచనాల ప్రకారం.. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ. 10, డీజిల్‌పై రూ. 13 చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నష్టపోతున్నాయి. దేశంలో ఏప్రిల్ 2022 తర్వాత ధరలు పెద్దగా మారలేదు (మార్చి 2024 లో కేంద్రం రూ. 2 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం మినహా). ఈ నేపథ్యంలో చమురు సంస్థల సమాచారం ప్రకారం మున్ముందు మరికొంత ధరల పెంపు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే గిగ్ వర్కర్లు ఈ 5 గంటల తాత్కాలిక సమ్మె ద్వారా తమ ఆవేదనను ప్రభుత్వానికి, యాప్ కంపెనీలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

