Delimitation Bill : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తదనంతర పరిణామాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీవీకే (TVK) పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో, సుదీర్ఘ మిత్రపక్షంగా ఉన్న డీఎంకే (DMK) కాంగ్రెస్‌తో తన బంధాన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. ఈ రాజకీయ సమీకరణాల మార్పుల నేపథ్యంలో, రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వం ప్రతిపాదించనున్న ‘డీలిమిటేషన్ బిల్లు’ (నియోజకవర్గాల పునర్విభజన బిల్లు) పై డీఎంకే అనుసరించబోయే వ్యూహంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
గతంలో ఇండీ (INDIA) కూటమిలో భాగస్వామిగా ఉన్న సమయంలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే, ఇప్పుడు కాంగ్రెస్‌తో దూరం పెరగడంతో కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా మారినట్లు రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. డీలిమిటేషన్ బిల్లుపై సస్పెన్స్: డీఎంకే తదుపరి అడుగు ఎటు? గతంలో ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లు లోక్‌సభ టేబుల్‌పైకి వచ్చిన తర్వాతే సమగ్రంగా పరిశీలించి తమ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని డీఎంకే నాయకత్వం స్పష్టం చేస్తోంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా తగిన రక్షణలు కల్పిస్తే బిల్లుకు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆ పార్టీ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. పార్లమెంట్‌లో 22 లోక్‌సభ స్థానాల బలం ఉన్న డీఎంకే, కాంగ్రెస్ నుండి విడిగా కూర్చోవడానికి ప్రత్యేక సీట్లను కూడా కోరడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఒకవేళ డీఎంకే ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, అది జాతీయ రాజకీయాల్లో విపక్షాల ఐక్యతకు పెద్ద దెబ్బ కావడమే కాకుండా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి భారీ విజయం కానుంది.

