KC Venugopal: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల వివాదంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో ప్రతిపక్షం ఎప్పుడూ ఒక ‘వాచ్‌డాగ్’ లా వ్యవహరిస్తుందని ఆయన తేల్చిచెప్పారు.

పార్లమెంటులో నీట్ అక్రమాలపై నిలదీత – అమిత్ షాకు రాహుల్ గాంధీ ప్రశ్నలు
నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పార్లమెంటు వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ఈ అంశంపై కేంద్రం తప్పించుకోవడానికి వీలుపడదని వేణుగోపాల్ హెచ్చరించారు. ఈ లోపభూయిష్ట పరీక్షా విధానం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పెల్లెట్ గన్లు ఉపయోగించడానికి పోలీసులకు అనుమతి ఇచ్చింది ఎవరంటూ హోంమంత్రి అమిత్ షాను రాహుల్ గాంధీ లేఖ ద్వారా ప్రశ్నించారని ఆయన గుర్తుచేశారు. ఈ కీలక ప్రశ్నలకు అమిత్ షా సమాధానం చెప్పే వరకు పార్లమెంటు సజావుగా సాగనివ్వబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి వల్లే ప్రభుత్వం దిగివచ్చి నీట్ అంశంపై బిల్లు తెస్తోందని, దీనిపై విపక్షాలన్నీ కలిసి సరైన వ్యూహంతో ముందుకు వెళ్తాయని చెప్పారు.
KC Venugopal: డీలిమిటేషన్ అంశంపై విపక్షాల సిద్ధత
కేంద్ర ప్రభుత్వం తలపెట్టబోయే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై కూడా వేణుగోపాల్ స్పందించారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సన్నద్ధంగా ఉందని తెలిపారు. మోదీ ప్రభుత్వం ముందుగా బిల్లును తీసుకొని రావాలని, ఆ తర్వాత తాము అనుసరించాల్సిన విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Epaper: epaper.vaartha.com

