Detergent Price Hike: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) వినియోగదారులకు గట్టి షాకిచ్చింది. ఉత్పత్తిలో వాడే ముడిసరుకుల ధరలు గణనీయంగా పెరగడంతో, కంపెనీ తన ప్రముఖ డిటర్జెంట్ బ్రాండ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ నెల నుంచి ఈ కొత్త ధరలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఇళ్లలో నిత్యం వాడే డిటర్జెంట్ పౌడర్లు, సోపుల ధరలు పెరగడం సామాన్య మధ్యతరగతి ప్రజల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపనుంది.

సర్ఫ్ ఎక్సెల్ మరియు రిన్ ఉత్పత్తుల కొత్త ధరలు
ధరల పెంపు ప్రభావం ప్రధానంగా సర్ఫ్ ఎక్సెల్ మరియు రిన్ బ్రాండ్లపై పడింది.
- సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్: కేజీ ప్యాక్ ధర రూ.167 నుంచి రూ.172కి పెరుగగా, 500 గ్రాముల ప్యాక్ ధర రూ.85 నుంచి రూ.87కి చేరింది. అలాగే 250 గ్రాముల సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర రూ.42 నుంచి రూ.45కి పెరిగింది.
- రిన్ ఉత్పత్తులు: రిన్ పౌడర్ కేజీ ప్యాకెట్ ధర రూ.120 నుంచి రూ.123కి పెరిగింది. ఇక రిన్ అలా (500 మి.లీ) లిక్విడ్ ధర రూ.90 నుంచి రూ.95కి చేరింది.
Detergent Price Hike: వీల్ పౌడర్ ధర కూడా పెంపు
పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే వీల్ (Wheel) డిటర్జెంట్ బ్రాండ్ ధరను కూడా కంపెనీ సవరించింది. వీల్ పౌడర్ కేజీ ప్యాక్ ధర గతంలో రూ.90 ఉండగా, తాజా పెంపుతో అది రూ.93కి చేరింది. ముడిసరుకుల వ్యయం పెరగడమే ఈ ధరల సవరణకు ప్రధాన కారణమని హెచ్యూఎల్ వర్గాలు వెల్లడించాయి.
Epaper: epaper.vaartha.com

