D-Mart : ప్రముఖ సూపర్‌మార్కెట్ చైన్ డీమార్ట్ (D-Mart) లో షాపింగ్ చేసే వినియోగదారులు బిల్లు విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ పరిధిలోని ఇండోర్‌కు చెందిన ఒక మహిళ డీమార్ట్‌లో షాపింగ్ చేస్తుండగా, డిస్‌ప్లే బోర్డుపై కిలో చక్కెర ధర రూ. 60.50 అని ఉండటంతో దాన్ని కొనుగోలు చేశారు. అయితే, కౌంటర్ వద్ద బిల్లింగ్ పూర్తి చేసుకున్నాక చెక్ చేసుకోగా, ఆ చక్కెర రేటును రూ. 67 గా బిల్లు చేసినట్లు ఆమె గుర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మహిళ అక్కడి సిబ్బందిని నేరుగా నిలదీశారు. ప్రదర్శించే ధర ఒకటైతే, బిల్లులో ఎక్కువ మొత్తం వసూలు చేయడం ఏంటని, ప్రతీ ఒక్కరూ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించలేరని, ఇలా రోజూ ఎంతమంది వినియోగదారులను మోసం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది తీవ్రంగా వైరల్ అవుతోంది.

వినియోగదారుల ఆగ్రహం: ‘బిల్లు చెక్ చేసుకోకపోతే జేబుకు చిల్లే!’
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అనేక మంది నెటిజన్లు స్పందిస్తూ తమకు కూడా పలు సూపర్ మార్కెట్లలో ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫర్ల పేరుతో డిస్‌ప్లే బోర్డులపై తక్కువ ధరలు చూపిస్తూ, బిల్లింగ్ సిస్టమ్‌లో మాత్రం పాత లేదా ఎక్కువ ధరలను అప్‌డేట్ చేసి కస్టమర్ల నుండి అదనంగా డబ్బులు లాగుతున్నారని ఆరోపిస్తున్నారు. చాలామంది వినియోగదారులు రద్దీలో బిల్లులో ప్రతి వస్తువు ధరను సరిచూసుకోకుండానే వెళ్ళిపోతుంటారు. దాన్నే ఆసరాగా చేసుకుని కొన్ని సూపర్ మార్కెట్లు కోట్ల రూపాయల అదనపు ప్రాఫిట్ పొందుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. షాపింగ్ పూర్తయ్యాక కౌంటర్ దాటే ముందే ప్రతి వస్తువు డిస్‌ప్లే ధరను మరియు బిల్లులోని రేటును సరిచూసుకోవాలని, తేడాలు ఉంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

