HYD - VJD Bus Accident : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర రహదారి ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
హైదరాబాద్ నుండి ఏలూరు వైపు 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న ఐరన్ రాడ్ల కంటైనర్ DCMను వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ప్రమాదానికి దారితీసిన కారణాలు - భయాందోళనలో ప్రయాణికులు
ఈ భయంకర ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గాఢ నిద్రలో ఉన్న డ్రైవర్, రాడ్లతో వెళ్తున్న DCMను కుడి వైపు నుంచి ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో బస్సు కుడి భాగం కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో DCMలోని ఐరన్ రాడ్లు బస్సు బాడీని చీల్చుకుంటూ లోపలికి దూసుకెళ్లాయి. బస్సు కుడి వైపు సీట్లలో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యవధి కూడా లేకుండానే రాడ్ల దెబ్బకు రక్సిసిక్తమై ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలంలో విరిగిన ఐరన్ రాడ్లు, ప్రయాణికుల ఆర్తనాదాలతో వాతావరణం అత్యంత భీతావహంగా మారింది.

