VSR : మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయంగా తీవ్ర దూకుడు పెంచారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, సీఎం నారా చంద్రబాబు నాయుడులపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో హిందూ మతాన్ని కించపరిచే చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని, వాటిని అడ్డుకుని తీరుతానని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అధికార స్వార్థం కోసం ఐదేళ్లకోసారి కూటమిని మారుస్తూ, ఒకసారి బిజెపితో మరోసారి కాంగ్రెస్‌తో జతకడతారని, అందుకే ఆయన మతవిద్వేషాల పట్ల ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు, జగన్ మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో మతమార్పిడులను ప్రోత్సహించారే తప్ప, ఏరోజూ హిందూ మతాన్ని గౌరవించలేదని విమర్శించారు.

కొత్త పార్టీ దిశగా అడుగులు: ‘సాధిక్’ వంటి వారికి యూపీ తరహా ట్రీట్‌మెంట్!
రాష్ట్రంలో శాంతిభద్రతలు, మత సామరస్యం కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించిన విజయసాయి రెడ్డి, తాను గనుక అధికారంలోకి వస్తే సాధిక్ వంటి వ్యక్తులకు ఉత్తరప్రదేశ్ తరహాలో కఠినమైన ‘ట్రీట్‌మెంట్’ ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా, రాబోయే 3 నుంచి 4 నెలల వ్యవధిలోనే నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని సంచలన వెల్లడి చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.

