Varanasi School Teacher Crime: ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం వారణాసి (Varanasi) లో ఒక ప్లే స్కూల్ ఉపాధ్యాయురాలి అమానుష ప్రవర్తన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
ఐదేళ్ల పసి బాలుడిపై ఆ టీచర్ ప్రదర్శించిన క్రూరత్వం స్థానికంగా తీవ్ర ఆగ్రహజ్వాలలకు దారితీసింది.
దుస్తుల్లో మూత్రం పోశాడని అమానుషం

బాధిత బాలుడి తల్లిదండ్రులు పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. వారణాసిలోని ఒక ప్లే స్కూల్‌లో (Play School) ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడు క్లాస్‌రూమ్‌లో ఉన్న సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వమని ఉపాధ్యాయురాలిని కోరాడు. అయితే టీచర్ అందుకు నిరాకరించడంతో, ఆ చిన్నారి ఆపుకోలేక తన దుస్తుల్లోనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ఉపాధ్యాయురాలు, పసివాడని కూడా చూడకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించింది. కత్తిని వేడి చేసి బాలుడి మర్మాంగాలపై వాతలు పెట్టింది.
Varanasi School Teacher Crime: బెదిరింపులు.. విచారణ చేపట్టిన పోలీసులు
ఈ వికృత చర్యకు పాల్పడిన అనంతరం, జరిగిన విషయాన్ని ఇంట్లో ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ చిన్నారిని బెదిరించింది. అయితే ఇంటికి వచ్చిన బాలుడు నొప్పితో తీవ్రంగా విలవిలలాడుతుండటం గమనించిన తల్లిదండ్రులు, అతడిని ప్రశ్నించగా ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు, సదరు ప్లే స్కూల్ టీచర్‌పై పలు చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, నిందితురాలిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

