Mangalagiri railway station: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో ప్రయాణికులను అలరించేందుకు సిద్ధమైంది.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ (ABSS) లో భాగంగా సుమారు రూ. 12.56 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్‌ను కార్పొరేట్ లుక్‌లోకి మార్చేశారు. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఈ పునరుద్ధరింపబడిన రైల్వే స్టేషన్‌ను ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు.

కార్పొరేట్ లుక్‌లో కొత్త భవనం.. వీఐపీ వసతులు!
ఈ ఆధునీకరణ ప్రాజెక్టులో భాగంగా పాత స్టేషన్ భవనానికి సరికొత్త రూపునివ్వడంతో పాటు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో ప్రవేశ మార్గాన్ని (సెకండ్ ఎంట్రీ) నిర్మించారు. సరికొత్త బుకింగ్ కౌంటర్లు, డిజిటల్ సూచికలు, అత్యాధునిక వెయిటింగ్ హాళ్లు, వీఐపీ లాంజ్ వంటి సదుపాయాలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. స్టేషన్ ముఖద్వారాన్ని ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్‌తో తీర్చిదిద్దారు. ప్లాట్‌ఫారమ్‌ల ఆధునీకరణ, మెరుగైన మరుగుదొడ్లు, సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు మరియు స్పష్టమైన సైనేజీ బోర్డులతో స్టేషన్ ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకుంది.
Mangalagiri railway station: దివ్యాంగులకు పెద్దపీట.. స్థానిక సంస్కృతికి అద్దం పట్టే కళాకృతులు
ప్రయాణికులందరికీ ప్రయాణం సులభతరం చేసేలా ప్లాట్‌ఫారమ్ 1, 4 లపై కొత్త షెల్టర్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రెండు లిఫ్టులు, ర్యాంపులు, టాక్టైల్ పాత్‌వేలు (నడిచే మార్గాలు) మరియు ప్రత్యేక శౌచాలయాలను నిర్మించారు. విశాలమైన పార్కింగ్ ఏరియా, పాదచారుల కోసం ప్రత్యేక ట్రాక్‌లు, రాత్రి వేళల్లో వెలుగులు విరజిమ్మేలా వీధి దీపాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు, మంగళగిరి ప్రాంతీయ వైభవాన్ని, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా అద్భుతమైన పెయింటింగ్స్, కళాకృతులతో గోడలను అలంకరించారు.
రాజధాని అమరావతి ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంటూ సేవలందిస్తున్న ఏకైక NSG-4 కేటగిరీ స్టేషన్‌గా మంగళగిరి ఎంతో కీలకమైనదని రైల్వే అధికారులు తెలిపారు. తాజా మేకోవర్ ద్వారా ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతి లభించడమే కాకుండా, రైల్వే సేవల సామర్థ్యం కూడా మరింత పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

