Appajipeta: అనంతపురం జిల్లాలోని అప్పాజీపేట గ్రామంలో వింత ఘటన కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా రాత్రి సమయాల్లో ఇళ్లపైకి గాల్లోంచి రాళ్లు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలో కొన్ని ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నట్లు సమాచారం. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య ఎక్కువగా రాళ్లు పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో రాత్రివేళ ఇళ్లలో ఉండేందుకు భయపడుతున్నామని, చాలామంది ఒకే చోట చేరి నిద్రిస్తున్నామని వాపోతున్నారు.
Read Also :RTC Driver Attack: బస్సు ఆపలేదని ఆగ్రహం.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి
పోలీసులకు ఫిర్యాదు.. నిఘాలోనూ రాళ్లు

రాళ్లు పడుతున్న ఘటనపై గ్రామస్థులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గ్రామంలో గస్తీ నిర్వహించారు. అయితే పోలీసులు నిఘా పెట్టిన సమయంలోనూ ఇళ్లపై రాళ్లు పడినట్లు సమాచారం. దీంతో ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులతో పాటు సుమారు 20 మంది యువకులు కూడా రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు సమీపంలోని కొండ ప్రాంతాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. వారు అక్కడ ఉన్న సమయంలోనూ ఇళ్లపైకి రాళ్లు పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
దెయ్యం పనంటున్న గ్రామస్థులు.. ఆకతాయిల పనేనంటున్న పోలీసులు
వరుసగా రాళ్లు పడుతుండటంతో గ్రామంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది దైవశక్తి లేదా అదృశ్య శక్తుల పని అయి ఉండొచ్చని కొందరు గ్రామస్థులు అనుమానిస్తూ స్వామీజీలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి ఘటనలకు అదృశ్య శక్తులతో సంబంధం ఉండకపోవచ్చని, ఆకతాయిలు కావాలనే రాళ్లు విసురుతూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించేందుకు పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు.
Appajipeta: సీసీ కెమెరాలు, నైట్ విజన్‌తో మిస్టరీ వీడేనా?
గతంలో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల్లోనూ రాత్రివేళ ఇళ్లపై రాళ్లు పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆయా ఘటనల్లో పోలీసులు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు నైట్ విజన్ కెమెరాలతో పరిశీలించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఘటనల్లో వ్యక్తులే రాళ్లు విసిరినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్పాజీపేటలోనూ సాధారణ గస్తీతో పాటు సీసీ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు లేదా డ్రోన్ల సాయంతో నిఘా పెంచితే రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో త్వరగా గుర్తించే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఇళ్లపై రాళ్లు పడటంతో తమకు నిద్ర లేకుండా పోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించి తమకు భద్రత కల్పించాలని పోలీసులను కోరుతున్నారు.
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు

