Kavitha Party TRS: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాల నడుమ ఏర్పాటైన 'తెలంగాణ రక్షణ సేన' (Telangana Rakshana Sena - TRS) పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) వద్ద లీగల్ వివాదంగా మారింది.
తమ పార్టీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే ఆమోదించి అధికారిక గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వారు ఈసీకి అత్యంత సుదీర్ఘమైన వివరణాత్మక లేఖను (Written Reply) పంపారు. దేశంలో ఒకే రకమైన పేర్లతో వందలాది పార్టీలు చట్టబద్ధంగా కొనసాగుతున్నప్పుడు, కేవలం తమ పార్టీ విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 29A కింద తమ దరఖాస్తును పరిశీలించి నిష్పాక్షికమైన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Read Also :Jubilee Hills Ferrari car accident: జూబ్లీహిల్స్ లో ఫెరారీ కారు బీభత్సం
“మాపై వచ్చిన ఆ 1,000 అభ్యంతరాల కాపీలు మాకు ఇవ్వండి!”
తమ పార్టీ పేరుపై సుమారు 1,000 అభ్యంతరాలు వచ్చాయని పేర్కొంటూ జూన్ 23న ఎన్నికల సంఘం తమకు లేఖ రాసిందని, అయితే వాటికి సంబంధించిన ఏ ఒక్క కాపీని కూడా పార్టీకి అందజేయలేదని ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆరోపించారు. “అసలు ఆ అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఎవరు? అందులో ఏముందో మాకు తెలియకుండా, వాటికి మేము సరైన వివరణ ఎలా ఇవ్వగలం? తెలంగాణలో మూడున్నర కోట్ల జనాభా ఉంటే, కేవలం 1,000 అభ్యంతరాలను సాకుగా చూపి రిజిస్ట్రేషన్ నిలిపివేయడం హేతుబద్ధం కాదు” అని పార్టీ లేఖలో పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం తాము ఈసీ ముందు వ్యక్తిగత విచారణకు (Personal Hearing) హాజరయ్యే ముందే, ఆ వెయ్యి అభ్యంతరాల కాపీలన్నింటినీ తమకు లిఖితపూర్వకంగా అందజేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.
Kavitha Party TRS:పేరు మార్చమంటే తీవ్ర నష్టం

ఈ ఏడాది ఏప్రిల్ 28న కేంద్ర ఎన్నికల సంఘమే స్వయంగా ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేరును కేటాయిస్తూ తమకు ప్రాథమిక లేఖ ఇచ్చిందని ఈ సందర్భంగా కవిత గుర్తుచేశారు. ఈసీ ఇచ్చిన ఆమోదాన్ని నమ్ముకుని ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి, భారీ ఎత్తున క్యాడర్‌ను సమీకరించి, సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు అకస్మాత్తుగా పేరు మార్చుకోవాలని ఆదేశిస్తే పార్టీకి భారీ నష్టం, అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల పేర్ల పోలికలను పరిశీలించేటప్పుడు పూర్తి పేరును సమగ్ర రూపంగా చూడాలి తప్ప.. అందులోని విడి పదాలను ముక్కలు చేసి చూడకూడదని ఈసీకి సూచించారు. ఈసీ ప్రస్తావిస్తున్న తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రాటిక్), తెలంగాణ రాజ్య సమితి అనేవి వేర్వేరు ఉచ్చారణ, వేర్వేరు నాయకత్వం కలిగిన పార్టీలని.. వాటితో తమ ‘తెలంగాణ రక్షణ సేన’కు ఎలాంటి పోలిక లేదని స్పష్టం చేశారు.
జాతీయ పార్టీల ఉదాహరణలు: గతంలో కేవలం ఒకే రకమైన భౌగోళిక, సిద్ధాంతపరమైన పదాలు ఉన్నాయనే కారణంతో ఏ పార్టీ రిజిస్ట్రేషన్‌నూ నిరాకరించలేదని కవిత లేఖలో గుర్తుచేశారు. దేశంలో ఆమ్ ఆద్మీ, అఖండ్ భారత్, మక్కల్, ప్రజా సేవ, జన్ రాష్ట్రీయ జనతా వంటి ఒకే తరహా పదాలతో వందలాది పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయని, వాటి జాబితాను కూడా ఈసీకి జతచేశారు. కేవలం ఊహాజనిత సంక్షిప్త రూపాల (Abbreviations) ఆధారంగా వచ్చిన అభ్యంతరాలన్నింటినీ తిరస్కరించాలని కోరారు.

