AP Telangana Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 24 గంటలుగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తుండగా, రాబోయే మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అధికారులు ‘బిగ్ రెయిన్ అలర్ట్’ జారీ చేశారు. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏపీలో జిల్లాల వారీగా వర్ష సూచన
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల తీవ్రత పెరిగింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ వ్యాప్తంగా వానలు పడే అవకాశం ఉంది.
జూన్ 25వ తేదీన ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ఇక జూన్ 26, 27 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేశారు. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్.. హైదరాబాద్‌లోనూ వానలు
తెలంగాణలోనూ రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడనున్నాయి. రాజధాని హైదరాబాద్‌లోనూ పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ జాగ్రత్తలు.. పశువుల కాపరులు అలర్ట్!
పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున వర్షం పడే సమయంలో ఎవరూ చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప వర్షం పడేటప్పుడు బయటకు రాకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఏపీలోని కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలతో పాటు ఎండ తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

