AP Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తీవ్ర తుఫాన్ ముప్పు పొంచివున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
తూర్పు మధ్య, ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న ఈ అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి 820 కి.మీ., కాకినాడకు 910 కి.మీ., మచిలీపట్నానికి 1020 కి.మీ., బాపట్లకు 1100 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

తీవ్ర తుఫాన్‌గా మారి బాపట్ల – విశాఖ మధ్య తీరందాటే ఛాన్స్
సోమవారం నాటికి ఈ వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాన్‌గా రూపాంతరం చెందనుందని అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెంది, వాయువ్య దిశగా పయనించి మరింత శక్తివంతం కానుంది. బుధవారం ఉదయానికి ఏపీ తీరానికి సమీపానికి చేరుకుని, బాపట్ల - విశాఖపట్నం మధ్య అతి తీవ్ర తుపానుగా (Very Severe Cyclonic Storm) తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కి.మీ., గరిష్టంగా 140 కి.మీ. వేగంతో ప్రమాదకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
AP Cyclone: ఏపీలో భారీ వర్షాలు – మత్స్యకారులకు హెచ్చరికలు
ఈ తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదివారం నాటికి కృష్ణా, బాపట్ల, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. రాబోయే తుపాను ముప్పు నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణపై కూడా తుఫాన్ ప్రభావం
కేవలం ఏపీపైనే కాకుండా ఈ తుఫాన్ ప్రభావం ఇరుగుపొరుగు రాష్ట్రమైన తెలంగాణపై కూడా పడనుంది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, ఈదురుగాలులు బలంగా వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

