Construction of Temples : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
దేవాలయాల నిర్మాణం, అభివృద్ధిపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి మొత్తం 4,192 ఆలయాల నిర్మాణానికి సవివరమైన ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందులో ఇప్పటికే 967 ఆలయాల నిర్మాణాలు విజయవంతంగా పూర్తయినట్లు వెల్లడించారు. మిగిలిన ఆలయ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై స్పష్టమైన ఆదేశాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ధార్మిక, విద్యా, మరియు వైద్య సేవల పురోగతిని సీఎం ఈ సందర్భంగా క్షుణ్ణంగా సమీక్షించారు. టీటీడీ నిర్వహించే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సమకూరే నిధులను కేవలం ఆలయాల నిర్మాణం మరియు సనాతన ధార్మిక కార్యక్రమాల వ్యాప్తికే ప్రాధాన్యత క్రమంలో వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక ప్రచారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు వేగవంతం చేస్తోందని పేర్కొన్నారు.

