AP DSC recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది డీఎస్సీ (DSC) ద్వారా మరో 3,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నామని పాఠశాల విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వెల్లడించారు.
విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి విద్యా రంగంలో వేగవంతమైన మార్పులు తీసుకువస్తున్నామని, ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16,000 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని గుర్తుచేశారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10,000 పాఠశాలల్లో 'వన్ క్లాస్ – వన్ టీచర్' (One Class One Teacher) విధానాన్ని విజయవంతంగా అమల్లోకి తెచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
శనివారం విజయనగరం జిల్లా దాసన్నపేటలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడారు. విద్యావ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన ప్రాథమిక సంస్కరణలు పూర్తయ్యాయని, ఇకపై ఉపాధ్యాయులంతా పూర్తిస్థాయిలో విద్యార్థుల అభ్యసనా ఫలితాలపైనే దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
Read Also : US: రూ. 30లక్షల అప్పుతో అమెరికా వెళ్లా - పెమ్మసాని
Recruitment for another 3,000 DSC posts in AP: Minister Lokesh’s announcement.
AP DSC recruitment: క్షేత్రస్థాయి పరిశీలన - నెలకు ఒకసారి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఇకపై నెలకు ఒకసారి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల్లో తాను స్వయంగా పాల్గొంటానని మంత్రి తెలిపారు. గత ఏడాది చేపట్టిన సంస్కరణల కారణంగానే విద్యా ఫలితాల్లో గణనీయమైన ప్రగతి కనిపించిందని, అయితే ఇది తొలిమెట్టు మాత్రమేనని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో పాఠశాలల్లో 100 శాతం అద్భుత ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని, వినూత్న బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులపై ఒత్తిడి లేని వాతావరణంలో విద్యను అందించాలని సూచించారు.
పిల్లల భద్రతే ముఖ్యం
విద్య ద్వారా మాత్రమే సమాజంలో గుణాత్మక మార్పు సాధ్యమవుతుందని తాను గట్టిగా నమ్ముతానని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలకు గ్రామీణ ప్రాంతాల నుంచి విభిన్న నేపథ్యాలు కలిగిన పిల్లలు వస్తుంటారని, వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విశాఖపట్నంలో ప్రైవేటు స్కూల్ టీచర్ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి కాలంలో విద్యార్థుల్లో క్రిటికల్, ఎనలిటికల్ థింకింగ్ పెరిగిందని, మారుతున్న కరికులమ్‌కు అనుగుణంగా పాఠశాలల్లో గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ (FLN) అందించడంతో పాటు ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు.

