Ap local body elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, సెల్ఫ్ అఫిడవిట్లను ప్రజా ఉపయోగం కోసం ఎస్‌ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసింది.
AP: ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండే పోలింగ్
హైకోర్టులో పిల్ విచారణ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల నామినేషన్ వివరాలు, అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో ఉంచేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వలపర్ల శివకార్తీక్ హైకోర్టులో పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేశారు. ఈ విచారణ సందర్భంలో, ఇప్పటికే అభ్యర్థుల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టామని, సంబంధిత విభాగాలకు తగిన ఆదేశాలు జారీ చేశామని ఎస్‌ఈసీ తెలిపింది. ఎస్‌ఈసీ సమర్పించిన వివరాలను నమోదు చేసుకున్న ధర్మాసనం ఈ పిల్ పిటిషన్‌ను పరిష్కరించింది.

వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు
పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల అభ్యర్థుల వివరాలు ప్రజలందరికీ సులభంగా కనిపించేలా ఎస్‌ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎస్‌ఈసీ పేర్కొంది. మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వార్డు సభ్యుల నామినేషన్ పత్రాలను క్రమం తప్పకుండా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల వివరాలూ ప్రత్యక్షంగ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు, అఫిడవిట్లు కూడా ఆన్‌లైన్‌లో పొందుపరచాలని అధికారులకు సూచించినట్లు ఎస్‌ఈసీ తెలిపింది. ఓటర్లు పోలింగ్ తేదీకి ముందే తమ అభ్యర్థుల నేపథ్యం, వివరాలను తెలుసుకునేలా ఎప్పటికప్పుడు డేటాను అప్‌డేట్ చేయాలని స్పష్టం చేస్తూ లేఖ రాసినట్లు వెల్లడించింది.
నవంబర్ 1న పుర పోలింగ్..
మరోవైపు, నవంబర్ 1న జరగనున్న 100 పట్టణ స్థానిక సంస్థల పోలింగ్‌కు ఎస్‌ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా రాష్ట్ర వ్యాప్తంగా 36,351 మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణకు, అక్రమాల నివారణకు డ్రోన్లు, సీసీ కెమెరాలు మరియు వీడియో గ్రాఫర్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

