KCR : సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి మరియు పొరుగున ఉన్న వెంకటాపురం గ్రామాల భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు సమర్పించిన నివేదిక ప్రకారం, ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325 పరిధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం 388 ఎకరాలు ఉండగా, క్షేత్రస్థాయి సర్వేలో కేవలం 343 ఎకరాలు మాత్రమే లభ్యమయ్యాయి. రికార్డులకు మరియు భూమికి మధ్య వ్యత్యాసంగా ఉన్న ఆ 45 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడికి పోయింది, ఎవరి ఆక్రమణలో ఉందో తక్షణమే రీ-సర్వే నిర్వహించి స్పష్టత తేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

కేసీఆర్ కుటుంబానికి నోటీసులు.. అమరవీరుల కాలనీకి ప్రతిపాదన
ఈ సరిహద్దు వివాదానికి సంబంధించి భూముల సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఫామ్‌హౌస్ పరిసరాల్లో ఉన్న తమ అధీనంలోని భూములకు సంబంధించిన రికార్డులు, సరిహద్దు పత్రాలను సమర్పించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా, ఈ సర్వే నంబర్ 325లో లెక్క తేలే రక్షిత/ప్రభుత్వ భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం సకల సౌకర్యాలతో ‘అమరవీరుల కాలనీ’ నిర్మించి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని హౌసింగ్ బోర్డును సీఎం ఆదేశించారు.

