Asian Games MMA 2026: భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) క్రీడా ప్రపంచంలో సుచికా తారియాల్ ఒక నయా అధ్యాయాన్ని లిఖించింది. ఏషియన్ గేమ్స్‌లో ఈ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది.
ఏషియన్ గేమ్స్‌లో ఎంఎంఏ క్రీడను ప్రవేశపెట్టిన తొలి ఏడాదే, మహిళల ట్రెడిషనల్ 60 కేజీల విభాగంలో సుచిక కాంస్య పతకాన్ని ముద్దాడి దేశానికి గర్వకారణంగా నిలిచింది.
సోమవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో సుచికా తలపడింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు నిర్ణీత సమయంలో ముగియకపోవడంతో అదనపు సమయంలోకి వెళ్లింది. చివరి వరకు ఆధిపత్యం కోసం పోరాడినప్పటికీ, అత్యల్ప పాయింట్ల తేడాతో సుచిక ఓటమి పాలై ఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది. అయినప్పటికీ, అంతకుముందే కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడంతో భారత్ ఖాతాలో చారిత్రక పతకం చేరింది.
Read Also : India vs Uzbekistan: భారత్ హాకీ జట్ల జోరు..ఇండోనేషియాకు చుక్కలు
Suchika Tariyal wins bronze in Asian Games MMA
Asian Games MMA: 2026 క్వార్టర్‌ఫైనల్‌లో ఘనవిజయం.. రికార్డు నమోదు
అంతకుముందు జరిగిన క్వార్టర్‌ఫైనల్ పోరులో మంగోలియా క్రీడాకారిణి అల్టాన్‌చిమెగ్ బైగల్మాపై సుచికా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 2-0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి ఏషియన్ గేమ్స్ ఎంఎంఏ విభాగంలో పతకం ఖాయం చేసిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు నమోదు చేసింది.
36 ఏళ్ల సుచికా తారియాల్ ప్రయాణం కేవలం ఎంఎంఏకే పరిమితం కాలేదు. జాతీయ స్థాయి జూడో అథ్లెట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంది. ఆ తర్వాత 2023 ఏషియన్ గేమ్స్‌లో ‘కురాష్’ విభాగంలోనూ, అనంతరం ‘జియూ-జిట్సు’ క్రీడలోనూ తన ప్రతిభను చాటుకుంది. 2024లో ఫైటింగ్ జియూ-జిట్సు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
గాయాలను అధిగమించి రీ-ఎంట్రీ.. చారిత్రక విజయం
2017లో ప్రొఫెషనల్ ఎంఎంఏలోకి అరంగేట్రం చేసిన సుచిక, జూడో మరియు జియూ-జిట్సుపై దృష్టి పెట్టడం వల్ల కొన్నేళ్ల పాటు ఎంఎంఏకు దూరంగా ఉంది. అయితే 2024లో తిరిగి ఎంఎంఏలోకి అడుగుపెట్టి ప్రసిద్ధ 'బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్'తో ఒప్పందం కుదుర్చుకుంది. తీవ్రమైన గాయాలు మరియు ఇతర అడ్డంకులను అధిగమించి, రింగ్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి ఎంఎంఏ పతకాన్ని అందించి భారత క్రీడా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పుటను కేటాయించుకుంది.

