Sawan Barwal: జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ సావన్ బర్వాల్ అపూర్వ విజయం సాధించారు. పురుషుల మారథాన్ విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ విజయంతో ఆసియా క్రీడల మారథాన్‌లో భారత్‌కు గత 44 ఏళ్లుగా కొనసాగుతున్న పతక ఎదురుచూపులకు ఆయన తెరదించారు. చివరిసారిగా 1982లో భారత్‌కు ఈ విభాగంలో పతకం దక్కగా, మళ్లీ ఇన్నాళ్లకు సావన్ ఆ లోటును భర్తీ చేశారు.

హోరాహోరీగా సాగిన మారథాన్ రేసు
శనివారం ఉదయం 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభమైన ఈ మారథాన్ (42.195 కిలోమీటర్ల దూరం) పోటీలో మొత్తం 19 మంది అథ్లెట్లు తలపడ్డారు. భారత్ తరఫున సావన్ బర్వాల్‌తో పాటు కార్తీక్ కర్కేరా బరిలోకి దిగారు. రేసు ప్రారంభమైన క్షణం నుంచే సావన్ అగ్రశ్రేణి రన్నర్లతో పోటీ పడుతూ దూసుకెళ్లారు. సగం దూరం ముగిసేసరికే ఆయన రెండో స్థానాన్ని దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.
Sawan Barwal: చివరి వరకు పోరాడి రజతం కైవసం చేసుకున్న సావన్
రేసులో భాగంగా 35 కిలోమీటర్ల మార్కును 1:49:29 సమయంతో సావన్ రెండో స్థానంలోనే దాటారు. ముగింపు దశలో జపాన్ అథ్లెట్ ఇచిటకా యమషితాతో ఆయన తీవ్రంగా పోటీ పడ్డారు. యమషితా ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం గెలవగా, సావన్ తన అద్భుతమైన పరుగును కొనసాగించి రెండో స్థానాన్ని నిలబెట్టుకుని రజతాన్ని సొంతం చేసుకున్నారు. ఇదే రేసులో పాల్గొన్న మరో భారత అథ్లెట్ కార్తీక్ కర్కేరా 2:22:41 సమయంతో 17వ స్థానంలో నిలిచారు.
విదేశీ గడ్డపై తొలిసారి మారథాన్ పతకం సాధించిన భారత పురుష అథ్లెట్
ఈ చారిత్రక విజయంతో సావన్ బర్వాల్ పలు అరుదైన రికార్డులను తన పేరున రాసుకున్నారు. విదేశీ గడ్డపై ఆసియా క్రీడల మారథాన్‌లో ఒక భారత పురుష అథ్లెట్ పతకం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆసియా క్రీడల మారథాన్ చరిత్రలో భారత్‌కు ఇది మొత్తంగా నాలుగో పతకం కావడం గమనార్హం. జాతీయ రికార్డు హోల్డర్ అయిన సావన్, ఈ ఘనతతో అంతర్జాతీయ వేదికపై దేశం గర్వపడేలా చేశారు.
జోష్నా చినప్ప అరుదైన రికార్డు.. ఏడో ఏషియన్ గేమ్స్‌లో ఆరో పతకం ఖాయం

