PM E Drive Scheme: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు, తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్' (పీఎం ఈ-డ్రైవ్) పథకం కింద అందిస్తున్న కొనుగోలు ప్రోత్సాహకాలను 2028 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
పథకం కాలపరిమితితో పాటు ద్విచక్ర వాహన విభాగానికి కేటాయించే నిధులను కూడా భారీగా పెంచింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Also : Gautam Adani : గౌతమ్ అదానీపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేసిన అమెరికా కోర్టు
Good news for EV enthusiasts: PM E-DRIVE subsidy increased!
PM E Drive Scheme: సవరించిన సబ్సిడీ నిబంధనలు, అర్హతలు
సవరించిన మార్గదర్శకాల ప్రకారం, 2025 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 మధ్య విక్రయించే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ వర్తిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా కిలోవాట్ అవర్‌కు (kWh) రూ. 2,500 చొప్పున ప్రోత్సాహకం లభిస్తుంది. ఒక్కో వాహనంపై గరిష్ఠంగా రూ. 5,000 వరకు మాత్రమే సబ్సిడీ అందుతుంది. కేవలం రూ. 1.5 లక్షల ఎక్స్-ఫ్యాక్టరీ ధర లోపు ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ఈ రాయితీ లభిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాయితీ క్లెయిమ్‌లు దాఖలు చేయడానికి 2027 డిసెంబర్ 31ని తుది గడువుగా నిర్ణయించారు. కేటాయించిన నిధులు అంతకంటే ముందే పూర్తయితే, ఆ తర్వాత ఎటువంటి క్లెయిమ్‌లను స్వీకరించబోమని స్పష్టం చేశారు.
నిధుల కేటాయింపు పెంపు & మార్కెట్ ప్రభావం
తాజా నిర్ణయంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగానికి కేటాయించిన నిధులు రూ. 1,772 కోట్ల నుంచి రూ. 2,767 కోట్లకు పెరిగాయి. ఈ నిధుల ద్వారా సుమారు 45.79 లక్షల రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. అలాగే పథకం మొత్తం బడ్జెట్ కేటాయింపులు కూడా రూ. 11,900 కోట్లకు చేరాయి.
దేశంలో ఈవీ వినియోగాన్ని పెంచే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకాన్ని రాజ్యసభ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం పొడిగించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో లాభాల్లో పయనించాయి. ఈ పొడిగింపు ఇటు వాహన తయారీదారులకు, అటు కొనుగోలుదారులకు దీర్ఘకాలిక భరోసా కల్పిస్తుందని పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

