Aids : హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికన్ నటి, మాజీ చైల్డ్ ఆర్టిస్ట్ డేవీ చేస్ (35) లాస్ ఏంజిల్స్‌లోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు.
జూన్ 16న సంభవించిన ఆమె మరణానికి గల కారణాలను విశ్లేషిస్తూ లాస్ ఏంజిల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ తాజాగా విడుదల చేసిన నివేదిక పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. డేవీ చేస్ ప్రమాదకరమైన ఎయిడ్స్ (AIDS) వ్యాధి బారిన పడి, దాని తీవ్రత వల్ల తలెత్తిన మెనింజైటిస్, బ్లడ్ ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వంటి ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు వైద్య నివేదికలో అధికారికంగా నిర్ధారించారు. కేవలం 35 ఏళ్ల ప్రాయంలోనే ఒకప్పటి స్టార్ నటి ఇలా అనారోగ్యంతో తనువు చాలించడం హాలీవుడ్ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

డ్రగ్స్ వ్యసనం మరియు హోమ్‌లెస్ జీవితం
ఏడేళ్ల చిన్న వయసులోనే బాలనటిగా హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన డేవీ చేస్.. 2002లో వచ్చిన ప్రపంచ ప్రసిద్ధ హర్రర్ చిత్రం 'ది రింగ్' (The Ring) లో సమారా మోర్గాన్ పాత్రతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే డిస్నీ యానిమేటెడ్ చిత్రం 'లిలో & స్టిట్చ్' (Lilo & Stitch) లో లిలో పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చి అవార్డులను గెలుచుకున్నారు. అయితే, చిన్ననాటి విజయాల తర్వాత ఆమె జీవితం క్రమంగా అంధకారంలోకి కూరుకుపోయింది. ఆమె తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, డేవీ చేస్ తన 13 ఏళ్ల వయసులోనే డ్రగ్స్ మహమ్మారికి (Polysubstance use) బానిసయ్యారు. జీవితం చివరి దశలో కుటుంబానికి దూరమై, తీవ్రమైన పేదరికం, నిరాశ్రయత (Homelessness) అనుభవిస్తూ లాస్ ఏంజిల్స్ వీధుల్లో గడిపినట్లు సమాచారం. తొలుత ఆమె కేవలం బ్లడ్ ఇన్‌ఫెక్షన్‌తోనే చనిపోయిందని భావించినప్పటికీ, అంతర్లీనంగా ఉన్న ఎయిడ్స్ వ్యాధే ఆమె మరణానికి ప్రధాన కారణమని తేలడంతో చిత్రసీమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

