El Niño : రాష్ట్రంలో ఎల్ నినో (El Niño) ప్రభావం తీవ్రంగా ఉందని, రాబోయే వేసవి కాలంలో నీటి కొరత తలెత్తకుండా ఉండేందుకు నీటి వాడకంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
అందుబాటులో ఉన్న జల వనరులను పొదుపుగా వాడుకోవడంలో భాగంగా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత నిస్సందేహంగా తాగునీటికేనని, ఆ తర్వాతే వ్యవసాయ అవసరాలకు ప్రాజెక్టుల నుంచి నీటిని కేటాయిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, వర్షభావ పరిస్థితుల దృష్ట్యా నీటి లభ్యతను నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికలతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

కేసీఆర్ అనాలోచిత విధానాలు - కాళేశ్వరం వైఫల్యంపై తీవ్ర విమర్శలు
ఇదే సమయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం రూ. 1.81 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినప్పటికీ, సరైన రూపకల్పన లేకపోవడంతో నిర్మాణం జరిగిన కొద్ది కాలానికే కూలిపోయిందని ఆరోపించారు. బిఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ చారిత్రక తప్పులు, అనాలోచిత విధానాల వల్లే ఉత్తర తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. సరైన ప్రణాళికలు లేకుండా ప్రాజెక్టుల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని, దాని పరిణామాలను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవించాల్సి వస్తోందని సభ దృష్టికి తెచ్చారు.

