Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిలిప్పీన్స్‌లో 6.5 తీవ్రతతో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్‌లో 6.5 తీవ్రతతో భారీ భూకంపం

వార్త 1 week ago

Philippines Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతాన్ని మరోసారి భారీ భూకంపం పలకరించింది. స్థానిక కాలమానం ప్రకారం, శుక్రవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది.

ఒక్కసారిగా భూమి తీవ్రంగా కంపించడంతో తీరప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా వారంతా ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చి, సమీపంలోని ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు.

భూ అంతర్భాగంలో 52 కిలోమీటర్ల లోతులో కేంద్రం

అమెరికా జియోలాజికల్ సర్వే (USGS), జర్మన్ రీసెర్చ్ సెంటర్ (GFZ) వెల్లడించిన నివేదికల ప్రకారం.. దవావో రీజియన్‌ పరిధిలోని సారంగాని పట్టణానికి దాదాపు 34 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూ ఉపరితలానికి సుమారు 42 నుంచి 52 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు సంభవించాయి. భూకంప ప్రభావంతో దవావో నగరంలోని పెద్ద పెద్ద భవనాలు, కార్యాలయాలు ఊగిపోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Philippines Earthquake: ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదు

ఈ విపత్తు కారణంగా సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. భూకంపం తీవ్రమైనదే అయినప్పటికీ, ప్రస్తుతానికి సముద్ర తీర ప్రాంతాలకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని విపత్తు నిర్వహణ అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

జూన్ 8 నాటి పెను విపత్తు చేదు జ్ఞాపకాలు

ఇదే మిండనావో ప్రాంతంలో జూన్ 8వ తేదీన 7.8 తీవ్రతతో సంభవించిన ఘోర భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి స్థానికులు ఇంకా కోలుకోకముందే ఈ తాజా ప్రమాదం సంభవించింది. ఆ పెను భూకంపం కారణంగా దాదాపు 81 మంది దుర్మరణం పాలవగా, 1,300 మందికి పైగా గాయపడ్డారు. అంతేకాకుండా సుమారు 16 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భౌగోళికంగా ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంత ప్రమాదకరమైన ‘రింగ్ ఆఫ్ ఫైర్’ (Ring of Fire) జోన్‌లో విస్తరించి ఉంది. టెక్టోనిక్ ప్లేట్ల నిరంతర కదలికలు, అగ్నిపర్వతాల ఉనికి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి భారీ భూకంపాలు మరియు ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం సర్వసాధారణంగా మారుతోంది.

వెనిజులా భూకంపాల్లో 235 మంది మృతి, 4,300 మందికి గాయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha