Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాదె సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. సీఐ నాగరాజు అరెస్టు

గాదె సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. సీఐ నాగరాజు అరెస్టు

వార్త 1 week ago

CI Nagaraju Arrested: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేకెత్తించిన గాదె సాయికృష్ణ (25) మిస్సింగ్ కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT), కృష్ణలంక సస్పెండెడ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) ఎస్‌ఎస్‌వీవీ నాగరాజును అధికారికంగా అరెస్ట్ చేసింది.

లాకప్ డెత్, బాడీ మాయం ఆరోపణలు.. రంగంలోకి సిట్

గత మే 9వ తేదీన కృష్ణలంక పోలీసులు తన కుమారుడైన సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకెళ్లారని, ఆ తర్వాత అతను తిరిగి రాలేదని బాధితుడి తల్లి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తన కొడుకును విపరీతంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెట్టడం వల్లే లాకప్ డెత్ జరిగిందని, ఆపై నిజాన్ని దాచేందుకు మృతదేహాన్ని కూడా మాయం చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో కూటమి ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. వెంటనే సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతో పాటు లోతైన విచారణ కోసం ప్రత్యేకంగా ‘సిట్’ను రంగంలోకి దించింది.

CI Nagaraju Arrested: సీఐపై మర్డర్ కేసు.. అరెస్ట్ వేళ హైడ్రామా

బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ నాగరాజుపై హత్య (Murder), అక్రమ నిర్బంధం (Illegal Detention) వంటి తీవ్రమైన సెక్షన్ల కింద భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. మంగళవారం సిట్ అధికారులు విజయవాడ సింగ్ నగర్‌లో ఉన్న సీఐ నాగరాజు నివాసానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో సీఐ అరెస్ట్‌ను అడ్డుకునేందుకు ఆయన మద్దతుదారులు, అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వెంటనే అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. అనంతరం నాగరాజును సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడ సుమారు ఐదు గంటల పాటు అధికారులు ఆయనను సుదీర్ఘంగా, లోతుగా ప్రశ్నించారు. విచారణలో కీలక ఆధారాలు లభించడంతో చివరకు ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు సిట్ ప్రకటించింది. ఈ అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని నాగరాజు కుటుంబ సభ్యులకు అధికారికంగా చేరవేశారు. ఈ అరెస్ట్‌తో సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న అసలు రహస్యాలు త్వరలోనే బయటకు వస్తాయని భావిస్తున్నారు.

పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం..మంత్రి లోకేశ్ సంతాపం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha