Madhya Pradesh Road Accident: మధ్యప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారిపై ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉమరియా జిల్లాలోని జాతీయ రహదారి 43 (NH-43) పై గురువారం (జూలై 09) తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటన ఒకే కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
అనూప్పూర్ జిల్లా లీలా టోలాకు చెందిన మార్కో కుటుంబం, తమ చిన్న కుమార్తె ఖుష్బూ మార్కోను పరీక్ష కోసం చిత్రకూట్‌లోని పరీక్షా కేంద్రంలో దింపడానికి కారులో బయలుదేరింది. తెల్లవారుజామున 3 నుండి 4 గంటల మధ్య సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరౌలా గ్రామంలో గల సిద్ధబాబా ఆలయం సమీపానికి రాగానే వీరి వాహనం ప్రమాదానికి గురైంది. భారీ వర్షం కురుస్తుండటంతో పాటు అతివేగం కారణంగా అదుపు తప్పిన కారు, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వెనుక నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది.
Read Also : Tirupati crime: తిరుపతిలో దారుణం.. మేస్త్రిని ఇటుకలతో కొట్టి చంపిన దుండగులు!
Four killed in road accident!
Madhya Pradesh Road Accident: సర్పంచ్, మహిళా హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురు అక్కడికక్కడే మృతి
ఈ ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 37 ఏళ్ల గ్రామ సర్పంచ్ కుల్పత్ సింగ్, ఆయన భార్య, హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సవితా సింగ్ మార్కో (32), వారి మూడేళ్ల కుమారుడు రుద్ర ప్రతాప్, అలాగే కుల్పత్ సింగ్ సోదరుడి కుమార్తె ప్రియాంక సింగ్ (24) ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించి వెలికితీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ దాదన్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినప్పటికీ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాడు.
పరీక్ష రాయాల్సిన యువతి పరిస్థితి విషమం
పరీక్ష రాయవలసిన ఖుష్బూ మార్కో (22) ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె శ్వాస ఆగిపోగా, జిల్లా ఆసుపత్రి వైద్యులు తక్షణమే స్పందించి సీపీఆర్ (CPR) అందించి ప్రాణాలు నిలిపారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వైద్య ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు: అమెరికా-ఇరాన్ దాడులపై భారత్ ఆందోళన

