Sangareddy Satwar Road Accident: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్వార్ గ్రామం సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఒక ఆటోను వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ తీవ్రస్థాయిలో ఢీకొట్టడంతో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఒకే ఆటోలో 13 మంది ప్రయాణం
పోలీసులు మరియు స్థానికులు వెల్లడించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా పనుల నిమిత్తం వెళ్తుండగా, సత్వార్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ట్యాంకర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యి రహదారి పక్కకు ఎగిరిపడింది. ప్రమాద తీవ్రతకు ఏడుగురు కూలీలు ల్యాండ్ స్పాట్‌లోనే రక్తం ఓడుతూ మృతి చెందారు.
Sangareddy Satwar Road Accident:మరొక ఆరుగురికి తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో మిగిలిన ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే చిరాగ్‌పల్లి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్సుల ద్వారా వెంటనే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు, పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక వాసులుగా గుర్తింపు
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులంతా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని బీదర్ జిల్లా, రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. ప్రతిరోజు వీరు ఉపాధి కోసం సరిహద్దు ప్రాంతాలకు వచ్చిపోతుంటారని తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసిన చిరాగ్‌పల్లి పోలీసులు, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై విచారణ వేగవంతం చేశారు. ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు మృతి చెందడంతో రాజగిరి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి
తెలంగాణ లో ముగిసిన SIR ప్రక్రియ ! మరి మీ ఓటు ఉందా? చెక్ చేసుకోండి

