Guwahati Hotel Firing: అస్సాం రాజధాని గౌహతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బోరా సర్వీస్ ప్రాంతంలోని బిలాస్ ఇన్ హోటల్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
హోటల్ యజమానికి, దానిని లీజుకు తీసుకున్న వ్యక్తికి మధ్య నెలకొన్న ఆస్తి వివాదమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.
Read Also :Bride Collapses Outside UP Hotel Room : యూపీలోని హోటల్ గది బయట కుప్పకూలి నూతన వధువు మృతి
లీజు వివాదమే కాల్పులకు కారణం

గౌహతి పోలీసు కమిషనర్ పార్థ సారథి మహంత తెలిపిన వివరాల ప్రకారం, హోటల్ యజమానికి, లీజుదారుడికి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. లీజు ఒప్పందానికి సంబంధించిన ఆస్తి వివాదం తీవ్రరూపం దాల్చడంతో లీజుదారుడు తన వద్ద ఉన్న లైసెన్స్ కలిగిన .32 బోర్ పిస్టల్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
ఐదుగురు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
ఈ కాల్పుల్లో ఆరుగురు గాయపడగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హోటల్ యజమాని తరఫువారేనని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Guwahati Hotel Firing: నిందితుడి అరెస్ట్.. దర్యాప్తు ముమ్మరం
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని చర్యలు చేపట్టారు. కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లీజుదారుడిని అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, వివాదానికి సంబంధించిన ఇతర అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గౌహతిలో జనసంచారం ఉండే ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆస్తి వివాదం కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది.

