Chinna Srinu: ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును ప్రత్యేకంగా కలుసుకున్నారు.
గోవాలోని గవర్నర్ అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ సమయంలో చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా పాల్గొన్నారు.

ఆతిథ్యమిచ్చిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
గవర్నర్ నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా ప్రత్యేకంగా పాల్గొన్నారు. చిన్న శ్రీను కుటుంబ సభ్యులకు ఆమె ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు చిన్న శ్రీనుకు, ఆయన కుమార్తెకు శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తు ప్రణాళికలపై ఆశీస్సులు అందించారు.
Chinna Srinu: పెద్దల సూచనలను పాటిస్తానన్న చిన్న శ్రీను
సమావేశం ముగిసిన తర్వాత చిన్న శ్రీను మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆదేశాలతో పాటు అశోక్ గజపతిరాజు వంటి సీనియర్ నేతల మార్గనిర్దేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని స్పష్టం చేశారు. కేవలం వారి పెద్దల ఆశీస్సులు, సలహాలు తీసుకోవడం కోసమే ఈ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు.
రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న సమావేశం
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు మేనల్లుడైన చిన్న శ్రీను, ఇటీవల తన కుమార్తె సిరి సహస్రతో కలిసి ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆయన పార్టీ మారిన తరుణంలో విజయనగరం జిల్లా రాజకీయాల్లో ప్రముఖుడైన అశోక్ గజపతిరాజును కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా, ప్రాధాన్యత సంతరించుకుంది.
Epaper: epaper.vaartha.com

