Heavy Rain in Gujarat : గుజరాత్ రాష్ట్రంలో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ముఖ్యంగా ప్రముఖ పారిశ్రామిక నగరమైన సూరత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి.
అక్కడ కురుస్తున్న వర్షాల తీవ్రతను చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏకంగా 200 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే నగరంలోని వందలాది కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కేవలం 12 గంటల వ్యవధిలోనే సూరత్‌లో 311 మిల్లీమీటర్లు, కామ్రేజ్‌లో అత్యధికంగా 403 మిల్లీమీటర్లు, పల్సానాలో 357 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వరద నీరు భారీగా నగరంలోకి పోటెత్తడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

మరో 72 గంటలు డేంజర్ బెల్స్.. ఆరుగురు మృతి, వేల మంది తరలింపు!
రాష్ట్రంలో రాబోయే మరో 72 గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ వర్షాల బీభత్సానికి ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన విపత్తు నిర్వహణ బృందాలు, సుమారు 2 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎక్కడికక్కడ రోడ్లపై నడుము లోతు నీరు చేరడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

