Hyderabad: హైదరాబాద్‌లోని బేగంపేటలో నడుస్తున్న ఒక గర్ల్స్ హాస్టల్ కేంద్రంగా జరుగుతున్న భారీ మోసాన్ని పోలీసులు బయటపెట్టారు. ప్రకాశ్ నగర్ ప్రాంతంలోని 'అమినీత గర్ల్స్ హాస్టల్'పై బేగంపేట పోలీసులు మరియు మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.
ఈ ఆకస్మిక తనిఖీల్లో హాస్టల్ ముసుగులో అత్యంత రహస్యంగా సాగుతున్న అక్రమ ఫెర్టిలిటీ రాకెట్ గుట్టు రట్టయింది.

ఇతర రాష్ట్రాల యువతులతో అండాల సేకరణ
సుమారు ఏడాది కాలంగా ఈ ముఠా మహిళల హాస్టల్ పేరుతో ఈ అసాధారణ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి నిరుపేద యువతులను వివిధ ఆశలతో ఇక్కడికి రప్పించారు. వారి నుంచి అండాలను (Oocytes) బలవంతంగా లేదా ఆశ చూపి సేకరించి, నగరంలోని పలు సంతాన సాఫల్య కేంద్రాలకు (Fertility Centers) అక్రమంగా విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేవలం మహిళల అండాలే కాకుండా, కొందరు పురుషుల నుంచి వీర్య నమూనాలను సేకరిస్తున్నట్లు కూడా పోలీసులకు బలమైన ఆధారాలు లభించాయి.
పది మంది యువతుల గుర్తింపు.. ముమ్మరంగా దర్యాప్తు
ఈ ఉమ్మడి దాడులలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 మంది యువతులను పోలీసులు రక్షించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని సురక్షిత ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. బాధితులు ఇచ్చే సమాచారం ఆధారంగా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గర్ల్స్ హాస్టల్ పేరుతో ఇలాంటి దందాలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు, ఏయే ఫెర్టిలిటీ సెంటర్లు వీరికి సహకరిస్తున్నాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
Epaper: epaper.vaartha.com

