ZenC Labs : హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రొటోటైపింగ్ సెంటర్ T-Works ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'ZenC Labs' సైబర్ సెక్యూరిటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థను భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన ఎంపీ .. సంస్థ ఫౌండర్ & CEO రవి పుత్తా మరియు వారి బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సమాచార సాంకేతిక రంగం వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో డిజిటల్ వ్యవస్థలను సురక్షితంగా ఉంచడంలో సైబర్ సెక్యూరిటీ, AI సాంకేతికతలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ ఐటీ అడ్డాగా నిలబెట్టడంలో ఇటువంటి పరిశోధనాత్మక నూతన స్టార్టప్‌ల భాగస్వామ్యం ఎంతో ప్రశంసనీయమని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

సాంకేతిక దిగ్గజాల సమక్షంలో ఘనంగా ప్రారంభోత్సవం
డిజిటల్ బెదిరింపులను అరికట్టడమే లక్ష్యంగా అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ZenC Labs ప్రారంభోత్సవంలో పలువురు పారిశ్రామిక, సాంకేతిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ZenC Labs చీఫ్ మెంటార్ శ్రీ మురళి తలసిల, అరబిందో ఫార్మా గ్రూప్ CIO శ్రీ చిట్టి బాబు, వాల్యూమోమెంటమ్ సీనియర్ VP శ్రీ భరత్ అయ్యంగార్ లతో పాటు సైబర్ రక్షణ రంగానికి చెందిన ప్రముఖ నిపుణులు హాజరయ్యారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఎదురవుతున్న నూతన సవాళ్లను అధిగమిస్తూ, నాణ్యమైన సేవలను అందిస్తూ ZenC Labs సంస్థ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సభలోని అతిథులు శుభాకాంక్షలు తెలియజేశారు.

