Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ ఫ్యూచర్‌సిటీ పోలీసింగ్‌లో భారీ మార్పులు

హైదరాబాద్ ఫ్యూచర్‌సిటీ పోలీసింగ్‌లో భారీ మార్పులు

వార్త 2 weeks ago

Future City Police Commissionerate: హైదరాబాద్ ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వం పోలీసింగ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించింది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామిక కార్యకలాపాలకు అనుగుణంగా కొత్త శాంతిభద్రతల డివిజన్లు, ట్రాఫిక్ విభాగాలు, పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేసింది.

అలాగే కొన్ని పోలీస్‌స్టేషన్ల పేర్లు, వాటి పరిధుల్లో మార్పులు చేసింది.

KBR Park: మాదాపూర్ ప్రయాణం ఇక నిమిషాల్లోనే

మూడు కొత్త శాంతిభద్రతల డివిజన్లు

ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధిలో ఆమనగల్, కొత్తూరు, మొయినాబాద్ పేర్లతో మూడు కొత్త శాంతిభద్రతల డివిజన్లను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలోని పోలీస్‌స్టేషన్లను కూడా పునర్వ్యవస్థీకరించారు. మొయినాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను విడదీసి అజీజ్‌నగర్ పేరుతో కొత్త పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల నిర్వహణ మరింత విస్తృతంగా చేపట్టేందుకు అవకాశం ఏర్పడనుంది.

మూడు మహిళా పోలీస్‌స్టేషన్లు

మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా మూడు మహిళా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల జోన్లకు ఒక్కొక్కటి చొప్పున మహిళా పోలీస్‌స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.

శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పేరులో మార్పు

పోలీస్‌స్టేషన్ల పేర్ల విషయంలోనూ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పేరును పెద్దషాపూర్‌గా మార్చారు. దీనిని కొత్తూరు డివిజన్, షాద్‌నగర్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మరోవైపు ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు శంషాబాద్‌గా కొత్త పేరు పెట్టారు. దీంతో గతంలో ఉన్న రెండు ఠాణాల పేర్ల విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ పేరును మీర్‌ఖాన్‌పేటగా మార్చారు. కొత్త పరిపాలనా సరిహద్దులకు అనుగుణంగా పోలీస్‌స్టేషన్ల పరిధులను కూడా సర్దుబాటు చేశారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌ను తాజాగా ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. దీనిని మహేశ్వరం జోన్ పరిధిలో చేర్చారు. దీంతో ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధి మరింత విస్తరించింది.

Future City Police Commissionerate: ట్రాఫిక్ పోలీసింగ్‌లోనూ మార్పులు

ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌లో ఇప్పటివరకు ఉన్న ఒక ట్రాఫిక్ జోన్‌ను ట్రాఫిక్-1, ట్రాఫిక్-2గా రెండు జోన్లుగా విభజించారు. అలాగే చేవెళ్ల, షాద్‌నగర్, మహేశ్వరం పేర్లతో మూడు ట్రాఫిక్ డివిజన్లను ఏర్పాటు చేశారు. మొయినాబాద్, కొత్తూరు, ఆమనగల్ ప్రాంతాలకు ప్రత్యేకంగా మూడు కొత్త ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి వేగం పెరుగుతున్న నేపథ్యంలో రహదారులపై వాహనాల రాకపోకలు, కొత్త నివాస ప్రాంతాలు, పారిశ్రామిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు తాజా పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Epaper: epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha