Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ - ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు టూరిజం సర్క్యూట్..!

హైదరాబాద్ - ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు టూరిజం సర్క్యూట్..!

వార్త 2 weeks ago

Tourism Circuit : తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు హైదరాబాద్ నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు (Tourism Circuit) సులభంగా వెళ్లేలా ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల మీదుగా తిరిగి హైదరాబాద్ చేరుకునేలా ప్రత్యేక టూర్ సర్క్యూట్ ను ప్రతిపాదించారు. ఫారెస్ట్, ఐటీడీఏ, టూరిజం శాఖలు సమన్వయంతో ఈ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి.

ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు :

ఈ టూర్ సర్క్యూట్‌లో ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, అటవీ ప్రాంతాలు, జలపాతాలు వంటి పర్యాటక ఆకర్షణలను ఒకే ప్యాకేజీలో చేర్చాలని అధికారులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల పార్క్, ఖిల్లాతో పర్యటన ప్రారంభమై, ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దులోని అటవీ ప్రాంతాలను సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుబ్బల మంగమ్మ ఆలయం, కిన్నెరసాని, డీర్ పార్క్, ఫారెస్ట్ సఫారీ వంటి ప్రాంతాలను పర్యాటకులకు పరిచయం చేయనున్నారు. కిన్నెరసాని ఐలాండ్‌ను ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంపై అధికారులు దృష్టి సారించారు. అక్కడ బోటింగ్, రెస్టారెంట్, వసతి సదుపాయాలతో పాటు ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు.  తదుపరి భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, పర్ణశాల, సీతమ్మ నారచీరల ప్రాంతాలను ప్యాకేజీలో చేర్చనున్నారు. అక్కడి నుంచి ములుగు జిల్లాకు వెళ్లి నర్సింహస్వామి ఆలయం, బొగత జలపాతం, లక్నవరం తీగల వంతెన, రామప్ప ఆలయం వంటి ప్రాంతాలను సందర్శించేలా రూట్‌ను రూపొందిస్తున్నారు.

పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఒక రోజు, రెండు, మూడు, ఐదు రోజుల ప్యాకేజీలను రూపొందించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూరిజం ప్యాకేజీ అభివృద్ధికి సుమారు రూ.39 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఈ సర్క్యూట్ అమల్లోకి వస్తే హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులకు కొత్త టూరిజం అనుభవం లభించడంతో పాటు స్థానికంగా ఆదివాసీలు, యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కిన్నెరసాని, భద్రాచలం, ములుగు ప్రాంతాల పర్యాటక సామర్థ్యాన్ని మరింతగా వినియోగించుకునే అవకాశం ఏర్పడనుంది.

దంచికొడుతున్న వర్షాలు..! వినాయక చవితి వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha