Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

హైదరాబాద్‌లో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

వార్త 4 days ago

Saroornagar Babunagar Blast: భాగ్యనగరంలో మరోసారి అకస్మాత్తుగా సంభవించిన ఒక భారీ పేలుడు శబ్దం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నగరంలోని సరూర్‌నగర్ (Saroornagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాబూనగర్‌లో మంగళవారం (జూన్ 30) మధ్యాహ్నం సంభవించిన ఈ ఘోర ప్రమాద ధాటికి ఒక నివాస గృహం పూర్తిగా శిథిలమైంది.

ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఇల్లు కుప్పకూలడం, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకోవడంతో అసలేం జరిగిందో తెలియక చుట్టుపక్కల కాలనీవాసులు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.

Read Also:Bibigudem West Bypass Road Accident: లారీ-ట్యాంకర్ మధ్య నలిగిన కారు..ముగ్గురు మృతి!

క్షణాల వ్యవధిలో తప్పిన ప్రాణనష్టం.. కుప్పకూలిన ఇల్లు

బాబూనగర్‌లో గత 30 ఏళ్లుగా నివాసముంటున్న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో దేవేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉన్నారు. పేలుడు తీవ్రతకు ఇల్లు మొత్తం ఒకేసారి కుప్పకూలిపోయినప్పటికీ.. అదృష్టవశాత్తూ కుటుంబ సభ్యులంతా కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో అత్యంత ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. పేలుడు జరిగిన సమయంలో ఆ ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఇల్లు మొత్తం ధ్వంసమైనా ఆ సిలిండర్లకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం, అవి పేలకపోవడం విశేషం. ఒకవేళ ఆ సిలిండర్లు గనుక పేలి ఉంటే ప్రమాద తీవ్రత ఊహకందని విధంగా ఉండేదని, చుట్టుపక్కల ఇళ్లు కూడా గాల్లోకి లేచేవని స్థానికులు వణికిపోతూ చెప్పారు.

Saroornagar Babunagar Blast: మిస్టరీగా మారిన కారణం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

ఇల్లు మొత్తం ధ్వంసమయ్యేలా చేసిన ఈ భారీ పేలుడుకు గల అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇంట్లో ఉన్న హై-కెపాసిటీ పవర్ ఇన్వర్టర్ (Inverter) బ్యాటరీ పేలిందా? లేదా గదిలో మరేదైనా కెమికల్ రియాక్షన్ లేదా గ్యాస్ లీకేజీ జరిగిందా? అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగి నివాస గృహం శిథిలమైనప్పటికీ, ఘటన జరిగిన వెంటనే పోలీసులు గానీ, విపత్తు నిర్వహణ (DRF) సిబ్బంది గానీ సకాలంలో స్పందించలేదని, ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యం చేశారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

యూట్యూబ్‌ చూసి ఇంట్లోనే కాన్పు, తీవ్ర రక్తస్రావంతో బాలింత మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha