Panjagutta Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళిక రూపొందించింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను మేఘా సంస్థకు అప్పగించినట్లు సమాచారం. అయితే ప్రాజెక్టు అంచనా వ్యయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Defaulting Rice Millers: బియ్యం ఇవ్వకుంటే ఆస్తులు గల్లంతే
పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వరకు..

ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ పంజాగుట్టలోని ఎన్‌ఎఫ్‌సీఎల్ సర్కిల్ వద్ద ప్రారంభమై జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ వరకు కొనసాగనుంది. మొత్తం ఆరు లైన్లతో ఈ వంతెనను నిర్మించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని ముఫకంజా కాలేజ్ సమీపంలో వాహనాలు ఫ్లైఓవర్‌పైకి ఎక్కేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది.
అక్కడి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36ను కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. దీంతో పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ వరకు మధ్యలోని ట్రాఫిక్ సిగ్నళ్లను తప్పించుకుని నేరుగా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది.
ప్రత్యేక ర్యాంప్ కూడా..
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఫ్లైఓవర్‌పై ప్రయాణించి ముఫకంజా కాలేజ్ సమీపంలో దిగేలా డిజైన్ చేయనున్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ఎలివేటెడ్ కారిడార్ నుంచి జలగం వెంగళరావు పార్క్ వరకు ప్రత్యేక ర్యాంప్ నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులకు వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Panjagutta Flyover: కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్లకు బ్రేక్
మరోవైపు కేబీఆర్ పార్క్ చుట్టూ భారీ వ్యయంతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాలన్న ప్రతిపాదనను జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. గతంలో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు సుమారు రూ.1,090 కోట్లతో స్టీల్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న వన్‌వే విధానం కారణంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో భారీ మొత్తంలో ఖర్చు చేసి కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్లు సమాచారం. కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలకు సంబంధించి మేఘా, కేఎన్‌ఆర్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను కూడా జీహెచ్‌ఎంసీ రద్దు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంజాగుట్ట-జూబ్లీహిల్స్ ఎలివేటెడ్ కారిడార్‌పై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. మొత్తం వ్యయం, పనుల ప్రారంభ తేదీపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

