Kavitha: హైడ్రా కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తక్షణమే తప్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు ధిక్కరణ కేసుల్లో నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నారంటూ న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయన సమర్పించిన బేషరతు క్షమాపణను కోర్టు తిరస్కరించింది. రంగనాథ్ స్థానంలో మరో సమర్థుడైన ఐపీఎస్ అధికారిని తక్షణమే నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది చెంపపెట్టు: కవిత విమర్శలు
హైకోర్టు తాజా తీర్పుపై స్పందించిన మాజీ ఎంపీ, తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ అధికార దుర్వినియోగం, నిరంకుశ ధోరణులను ఈ తీర్పు స్పష్టంగా ఎండగట్టిందని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల ముసుగులో నిరుపేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తున్న తీరుకు ఇది గట్టి చెంపపెట్టు లాంటిదని ఆమె అభివర్ణించారు. సమాజంలో ధనిక, పేద అనే ఎలాంటి బేధాలు చూపకుండా ప్రభుత్వం పారదర్శక పాలన అందించాలని కవిత డిమాండ్ చేశారు.
Kavitha: పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయం వద్దు: నిష్పక్షపాత పాలనకు హితవు
న్యాయస్థానం హెచ్చరికలను లెక్కచేయకుండా హైడ్రా సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని కవిత ఆక్షేపించారు. కోర్టు ఉత్తర్వులను పలుమార్లు ఉల్లంఘించినా హైడ్రా పనితీరులో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించాలని హితవు పలికారు. పేదలకు ఒక రకమైన న్యాయం, పెద్దలకు మరో రకమైన న్యాయం అన్నట్లుగా వ్యవహరించడం మానుకుని, ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా ముందుకు సాగాలని సూచించారు.

