Dailyhunt
HighSpeed Train: హైదరాబాద్-వరంగల్‌కు నమో భారత్ ర్యాపిడ్ రైలు

HighSpeed Train: హైదరాబాద్-వరంగల్‌కు నమో భారత్ ర్యాపిడ్ రైలు

వార్త 2 months ago

హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు నమో భారత్ ర్యాపిడ్ స్పీడ్ రైలు(HighSpeed Train) కారిడార్‌ను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు మరో కీలక మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌గా ఈ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను ప్రకటించింది.

దీని ద్వారా రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

గంటలో ప్రయాణం… తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశ

దేశవ్యాప్తంగా మెట్రో నగరాలను సమీప పట్టణాలతో అనుసంధానించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 2,900 కిలోమీటర్ల మేర ర్యాపిడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టులో హైదరాబాద్-వరంగల్ కారిడార్‌కు కూడా చోటు కల్పించింది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే సుమారు మూడు గంటల సమయం పడుతుండగా, రైలు(HighSpeed Train) ప్రయాణం కూడా రెండు గంటలకు మించుతోంది. అయితే నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రారంభమైతే కేవలం గంటలోపే ఈ రెండు నగరాల మధ్య చేరుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఆర్థికంగా కీలక నగరంగా వరంగల్ గుర్తింపు పొందింది. ఇక్కడ ఐటీ సంస్థలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణిస్తున్నారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ర్యాపిడ్ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే హైదరాబాద్-వరంగల్ కారిడార్ వెంట కొత్త పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. దీని వల్ల వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. వరంగల్ ప్రాంత అభివృద్ధికి ఇది మరింత ఊతమిస్తుంది. భవిష్యత్తులో హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు నగరాలను కూడా సమీప పట్టణాలతో అనుసంధానించేలా నమో భారత్ ర్యాపిడ్ కారిడార్లను విస్తరించనున్నట్లు కేంద్రం తెలిపింది. నమో భారత్ ర్యాపిడ్ రైళ్లలో టికెట్ ధరలు అందుబాటులో ఉండేలా నిర్ణయించనున్నారు. ఆధునిక సదుపాయాలతో పాటు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతో అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. దీని ద్వారా పారిశ్రామిక, వాణిజ్య రంగాలు మరింతగా అభివృద్ధి చెందనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha