Kalvakuntla Kavitha: తెలంగాణ యాస, సంస్కృతిపై జరుగుతున్న ప్రచారంపై టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత మరోసారి తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన 'ఇడుపు కాయితం' అనే సినిమా టైటిల్‌ను ప్రస్తావిస్తూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉప్పల్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన కవిత.. తెలంగాణ భాషను అవహేళన చేసేలా జరుగుతున్న ట్రోలింగ్‌పై మండిపడ్డారు. ఆ పదం వెనుక ఉన్న అసలైన అర్థం తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను అడగాలంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ అస్తిత్వంపై దాడి.. రాజకీయ పార్టీల మౌనంపై ఆగ్రహం
ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'ఇడుపు కాయితం' సినిమా టైటిల్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. ముఖ్యంగా కొందరు ఆంధ్రా నెటిజన్లు ఈ పదాన్ని, తెలంగాణ యాసను తక్కువ చేసి మాట్లాడుతున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో మళ్లీ తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వంపై ఇలాంటి దాడులు జరుగుతున్నా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీతో పాటు సొంత పార్టీ బీఆర్ఎస్‌లోని కొందరు నాయకులు మౌనంగా ఉండటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
“మన భాషను, సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడినందుకే నాడు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్లీ ఇప్పుడు అలాంటి వెకిలి చేష్టలకు దిగితే చూస్తూ ఊరుకోం. ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసి ఉందాం, కానీ మా భాషను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదు.”
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ, సొంత పార్టీ నేతలపై విమర్శల బాణాలు
ఈ సందర్భంగా రాజకీయ పార్టీల వైఖరిని కవిత తీవ్రంగా ఎండగట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ దీనిపై నోరు మెదపడం లేదని విమర్శించారు. ఇక దేశీయ అంశాలపై మాట్లాడే బీజేపీకి తెలంగాణ సమస్యలు పట్టవన్నారు.
ఇదే క్రమంలో సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ మౌనం వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. పార్టీలో ఒక ‘గుంటనక్క’ ఉందని, ఆయన వ్యాపారాలన్నీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారితోనే ముడిపడి ఉండటం వల్లే మాట్లాడటం లేదంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Epaper: epaper.vaartha.com

