Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఇడుపు కాయితం' టైటిల్‌పై వివాదంపై స్పందించిన నటుడు నరేష్

'ఇడుపు కాయితం' టైటిల్‌పై వివాదంపై స్పందించిన నటుడు నరేష్

వార్త 3 weeks ago

Idupu Kayitham Movie Controversy: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఇడుపు కాయితం' అనే సినిమా టైటిల్ ఎంతటి తీవ్ర దుమారాన్ని రేపుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సోషల్ మీడియా వేదికగా ఈ పదం చుట్టూ ఆంధ్రా వర్సెస్ తెలంగాణ అనే రేంజ్‌లో నెటిజన్లు గ్రూపులుగా విడిపోయి ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ఒక సినిమా టైటిల్‌ను అడ్డుపెట్టుకుని ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ఈ వివాదంపై సీనియర్ నటుడు వీకే నరేష్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ నెటిజన్లకు, తెలుగు భాషా సంఘానికి కీలక విజ్ఞప్తి చేశారు.

ఒక సినిమా టైటిల్‌ను జాతీయ సమస్యగా మార్చేశారు: నరేష్ ఆవేదన

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను తాను గమనిస్తున్నానని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

"ఎవరో ఒకరిద్దరు చేసిన కామెంట్ల ఆధారంగా 'ఇడుపు కాయితం' అనే సినిమా టైటిల్‌ను ఒక జాతీయ సమస్యగా మార్చడం కరెక్ట్ కాదు. ఈ వివాదం సాకుతో ఒక గొప్ప మాండలీకాన్ని అవమానపరుస్తున్నారు. ఇది ఒక తెలుగువాడిగా మనమందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. తెలంగాణ అయినా, కోనసీమ అయినా, ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ అయినా.. ప్రతి మాండలీకం వెనుక ఎన్నో పోరాటాలు, చరిత్ర ఉన్నాయి. తెలుగువాళ్లుగా మన భాషను చూసి మనం గర్వపడాలి."

Idupu Kayitham Movie Controversy: సినిమాలను సినిమాల్లాగే చూడండి.. భాషా సంఘం చొరవ తీసుకోవాలి

తమిళ చిత్రం 'కరుప్పు' లేదా కన్నడ చిత్రం 'కాంతార' వంటి అన్యభాష చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరించి హిట్ చేశారని నరేష్ గుర్తుచేశారు. అలాంటప్పుడు మన సొంత భాషలోని ఒక పదాన్ని పట్టుకుని వివాదం చేయడం సరికాదన్నారు. "దయచేసి సినిమాను సినిమాలాగే చూడండి.. సినిమాను, భాషను కలిపి వివాదాలు సృష్టించకండి. మన సొంత భాషను మనమే నరుక్కుంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు" అని ఆయన హితవు పలికారు.

ఈ వివాదానికి తక్షణమే ముగింపు పలకడానికి 'తెలుగు భాషా సంఘం' బాధ్యత తీసుకోవాలని నరేష్ కోరారు. ప్రభుత్వం, మీడియా, భాషా సంఘాలు మరియు నెటిజన్లు అందరూ కలిసికట్టుగా స్పందించి.. ఈ వివాదానికి ఇక్కడితో ఎండ్ కార్డ్ వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరి సీనియర్ నటుడి విజ్ఞప్తితోనైనా ఈ వివాదం సర్దుమణుగుతుందో లేదో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha