Indiramma Houses : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మొదటి విడత (ఫేజ్-1) కింద మంజూరు చేసిన 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి పూర్తిగా పూర్తి చేయాలని గృహనిర్మాణ శాఖ (హౌసింగ్ డిపార్ట్మెంట్)కు ప్రభుత్వం స్పష్టమైన డెడ్లైన్ విధించింది. ఇందులో భాగంగా, ఇప్పటికే పునాదులు దాటి గోడలు, స్లాబ్ స్థాయికి చేరుకున్న ఇళ్లను మరింత త్వరగా, అంటే ఆగస్టు 15 నాటికే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కాకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను ముమ్మరం చేయాలని స్పష్టం చేసింది.

ఫేజ్-2 ప్రాధాన్యతలు- పూరి గుడిసెల వారికే తొలి అవకాశం
మరోవైపు, ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత (ఫేజ్-2)కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం మరింత కఠినతరం చేస్తూ అర్హులను గుర్తిస్తోంది. ఈ విడతలో పూర్తిగా పూరి గుడిసెల్లో నివసిస్తున్న అత్యంత పేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అందిన దరఖాస్తుల్లో సుమారు 37 వేల అప్లికేషన్లను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా సర్వే చేయగా, అందులో కేవలం 5 వేల మంది మాత్రమే పూర్తి అర్హులుగా తేలారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఈ సర్వే ప్రక్రియ కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి.

